Arvind Kejriwal: ప్రభుత్వాలను కూలదోసేందుకే రూ.6,300 కోట్లు ఖర్చు

దేశంలో ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు భాజపా(BJP) రూ.6,300 కోట్లు ఖర్చు చేసిందని ఆప్‌(AAP) అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) ఆరోపించారు...

Published : 28 Aug 2022 01:24 IST

భాజపాపై అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపణలు

దిల్లీ: దేశంలో ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు భాజపా(BJP) రూ.6,300 కోట్లు ఖర్చు చేసిందని ఆప్‌(AAP) అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) ఆరోపించారు. భాజపా ఈ పని చేయకపోతే.. వివిధ ఆహార పదార్థాలపై జీఎస్టీ(GST) విధించాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. ప్రభుత్వాలను కూలదోయడంలో భాజపాను సీరియల్ కిల్లర్‌గా అభివర్ణించిన మరుసటి రోజు కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సైతం దిల్లీ అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తూ.. జీఎస్టీతోపాటు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో వచ్చిన ఆదాయాన్ని భాజపా.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనేందుకు ఉపయోగిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వాలను కూలదోసేందుకు, ఎమ్మెల్యేలను కొనేందుకు రూ.కోట్లలో ఖర్చు చేస్తుండటంతోనే ధరల పెరుగుదల సమస్య వచ్చిందని ధ్వజమెత్తారు.

ఈ క్రమంలో శనివారం కేజ్రీవాల్‌ ఓ ట్వీట్‌ చేస్తూ.. ‘పెరుగు, మజ్జిగ, తేనె, గోధుమలు, బియ్యం తదితరాలపై విధించిన జీఎస్టీతో కేంద్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.7,500 కోట్ల ఆదాయం వస్తుంది. రాష్ట్రాల్లోని ఇతర పార్టీల ప్రభుత్వాలను పడగొట్టేందుకు భాజపా ఇప్పటి వరకు రూ.6300 కోట్లు ఖర్చు చేసింది. లేకపోతే.. ఈ ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించాల్సి వచ్చేది కాదు. ప్రజలకు అధిక ధరల సెగ తగిలేది కాదు’ అని రాసుకొచ్చారు.

కొన్నాళ్లుగా భాజపా, ఆప్‌ల మధ్య రాజకీయ విభేదాలు ముదురుతోన్న విషయం తెలిసిందే. దిల్లీ ప్రభుత్వాన్ని కూలదోయడం భాజపా ముందున్న ప్రధాన లక్ష్యమని కేజ్రీవాల్‌ ఆరోపిస్తున్నారు. అయితే, ఆ పార్టీ ‘ఆపరేషన్‌ కమలం’ దిల్లీలో విఫలమైందని, ఆప్‌ ఎమ్మెల్యేలెవరూ పార్టీని వీడబోరని నిరూపించేందుకు ఈనెల 29న విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని