రాహుల్‌గాంధీకి చరిత్ర పాఠాలు బోధించిన కేంద్రమంత్రి..!

కేంద్ర ప్రభుత్వ విధానాలు.. చైనా, పాకిస్థాన్‌ను దగ్గర చేశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భాజపా నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

Published : 03 Feb 2022 13:56 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ విధానాలు.. చైనా, పాకిస్థాన్‌ను దగ్గర చేశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భాజపా నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ నేత వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విదేశాంగమంత్రి జైశంకర్‌ కొన్ని చరిత్ర పాఠాలను రాహుల్‌కు బోధించారు. 

‘ చరిత్రలోని కొన్ని పాఠాలు మీకోసం..
* 1963లో పాకిస్థాన్‌ అక్రమంగా శాక్సగామ్(Shaksgam) లోయను చైనాకు అప్పగించింది.

* 1970లో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి చైనా కారకోరం రహదారిని నిర్మించింది. 

* 1970 నుంచి పాక్‌, చైనా అణు కార్యక్రమంలో సహకరించుకుంటున్నాయి.

* 2013లో చైనా- పాకిస్థాన్ ఆర్థిక నడవా ప్రారంభమైంది. అప్పుడైనా ఆ రెండు దేశాలు విడిగా ఉన్నాయా..? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి’ అంటూ జైశంకర్ కాంగ్రెస్ హయాంలో ఆ రెండు దేశాల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రస్తావించి, చురకలు వేశారు.

అలాగే అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ ఒంటరిగా మిగిలిపోయిందని, గణతంత్ర దినోత్సవాలకు ఒక్క విదేశీ అతిథిని కూడా తీసుకురాలేకపోయిందని రాహుల్ కేంద్రాన్ని విమర్శించారు. దీనిపై కూడా జై శంకర్ కౌంటర్ ఇచ్చారు. ‘గణతంత్ర  దినోత్సవానికి ఒక్క అతిథిని కూడా తీసుకురాలేకపోయామని లోక్‌సభలో రాహుల్ అన్నారు. మనం కరోనావేవ్ మధ్యలో ఉన్నామని భారత్‌లో నివసించే ప్రతిఒక్కరికీ తెలుసు. వాస్తవంలో ఈ వేడుకకు మధ్య ఆసియా దేశాలకు చెందిన అధ్యక్షులు హాజరుకావాల్సిఉంది. వారితో జనవరి 27న వర్చువల్‌గా సమావేశం జరిగింది. దానికి రాహుల్ హాజరుకాలేదా..?’ అంటూ సమాధానం ఇచ్చారు.

భారత్‌ రెండుగా కనిపిస్తోందని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. 

* ఒక భారత్‌లో ప్రజలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. రేవ్ పార్టీలు, తరచూ విదేశీ విహారయాత్రలకు వెళ్తుంటారు. 

* మరోపక్క ప్రజలు సాధారణ జీవనాన్ని సాగిస్తుంటారు. అవసరమైన వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. అలాగే భారతీయుడిలా ఆలోచిస్తారు. భారత సంప్రదాయాలను అనుసరిస్తారు అని వ్యాఖ్యానించారు.  ‘గతంలో ఆయన యువరాజ్‌లా ప్రవర్తించేవారు. ఇప్పుడు ఆయన దేశానికి రాజు అనుకుంటున్నారు’ అంటూ కాంగ్రెస్‌ నేతపై మండిపడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని