Rajasthan: సంజీవని స్కాం.. రాజస్థాన్‌ సీఎంపై కేంద్ర మంత్రి పరువు నష్టం దావా

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌పై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ పరువు నష్టం దావా వేశారు. సంజీవని కుంభకోణంలో తనను లాగి, తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు గహ్లోత్‌ యత్నించారని ఆరోపించారు..

Updated : 04 Mar 2023 23:44 IST

జైపుర్: ‘సంజీవని’ కుంభకోణం(Sanjeevani Scam) వ్యవహారంలోకి లాగి తన ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆరోపిస్తూ.. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌(Gajendra Singh Shekhawat) శనివారం రాజస్థాన్‌(Rajasthan) ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌పై దిల్లీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు, రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేసేందుకు సీఎం గహ్లోత్‌ యత్నిస్తున్నారని తన ఫిర్యాదు(Defamation Case)లో పేర్కొన్నారు. అయితే, కేంద్ర మంత్రి తాజా ఫిర్యాదుతో.. ఈ కుంభకోణం జాతీయ దృష్టిని ఆకర్షిస్తుందని గహ్లోత్‌(Ashok Gehlot) అన్నారు. ఈ సందర్భంగా  సీఎం గహ్లోత్‌ జైపుర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ‘నాపై పరువు నష్టం దావాను స్వాగతిస్తా. ఇది కేసు దర్యాప్తును వేగవంతం చేస్తుంది. కుంభకోణంలో డబ్బు కోల్పోయిన బాధితులకు ఊరట లభిస్తుంది’ అని అన్నారు.

ఈ కేసు దర్యాప్తులో సహకరించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కుంభకోణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు గమనించాలన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని తమ ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED)కి లేఖ రాసినప్పటికీ స్పందన లేకుండా పోయిందని గుర్తుచేశారు. ఇదిలా ఉండగా.. సంజీవని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో పెట్టుబడి పెట్టిన వేల మంది ప్రజలు రూ.900 కోట్ల మేర మోసపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. గజేంద్ర సింగ్ షెకావత్ కూడా వాటాదారుగా ఉన్న ఓ కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు సొసైటీ ఎండీ, ప్రధాన సూత్రధారి విక్రమ్ సింగ్.. ఇన్వెస్టర్ల సొమ్మును అక్రమంగా మళ్లించారనే ఆరోపణలు వచ్చాయి. రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్.. 2019 ఆగస్టు నుంచి ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని