Droupadi Murmu: గృహహింసను దాటుకొని, అత్యున్నత పదవికి పోటీలో నిలిచి..!

ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యారు ద్రౌపదీ ముర్మూ. రాష్ట్రపతి పదవికి ఎన్నిక కోసం ఆమె ఈ రోజు నామినేషన్‌ కూడా దాఖలు చేశారు.

Published : 24 Jun 2022 23:11 IST

దిల్లీ: ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యారు ద్రౌపదీ ముర్మూ. రాష్ట్రపతి పదవికి ఎన్నిక కోసం ఆమె ఈ రోజు నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. ఆమె గెలుపు కూడా నల్లేరుపై నడకే. ఈ క్రమంలో ఆమె ఎదిగిన తీరు అందరికి స్ఫూర్తిదాయకమంటున్నారు భాజపా ఎంపీ పీసీ మోహన్‌. 

ముర్మూకు చిన్నవయస్సులోనే వివాహమైందని, ఆ సమయంలో ఆమె గృహహింసను ఎదుర్కొన్నారన్నారు. అయితే అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆమె నిశ్చయించుకున్నారన్నారు. అందుకే ఆమె కథ అందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు. ‘చిన్న వయస్సులో వివామైంది. 15 ఏళ్లకే బిడ్డకు జన్మనిచ్చారు. గృహహింసను ఎదుర్కొన్నారు.. ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచిన ద్రౌపదీ ముర్మూ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఇంతటి దృఢత్వాన్ని చాటిన ఆమె.. అతిపెద్ద ప్రజాస్వామ్యంలో రాష్ట్రపతి పదవి కోసం వేసిన నామినేషన్‌తో ఈ దేశం పొంగిపోతోంది’ అని పీసీ మోహన్ ట్వీట్ చేశారు.

ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బైడపోసిలో 1958 జూన్‌ 20న ద్రౌపదీ ముర్మూ జన్మించారు. మొదట టీచర్‌గా పనిచేసిన ఆమె.. ఆ తర్వాత కౌన్సిలర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రాయ్‌రంగపూర్‌ నేషనల్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. రెండు పర్యాయాలు ఒడిశా అసెంబ్లీకి ఎన్నికైన ఆమె.. భాజపా- బిజూ జనతాదళ్‌ కలిసి ఏర్పాటుచేసిన నవీన్‌ పట్నాయక్‌ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వంలో 2000- 2004 మధ్య మంత్రిగా పనిచేశారు. 2010, 2013లో మయూర్‌భంజ్‌ భాజపా జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. 2013లో భాజపా ఎస్టీ మోర్చా జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలిగా ఉన్నారు. 2015 నుంచి 2021 వరకు ఝార్ఖండ్‌ గవర్నర్‌గా సేవలందించారు. ఆమెకు భర్త శ్యామ్‌ చరణ్‌ ముర్మూ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని