Gujarat Tragedy: తీగల వంతెన దుర్ఘటన.. భాజపా ఎంపీ కుటుంబంలో 12 మంది మృతి

గుజరాత్‌లో తీగల వంతెన కూలిన దుర్ఘటన భాజపా ఎంపీ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఆ ఎంపీ కుటుంబంలో 12 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

Updated : 31 Oct 2022 15:17 IST

మోర్బీ: గుజరాత్‌లోని మోర్బీ నగరంలో తీగల వంతెన కూలిన ఘోర దుర్ఘటన.. అనేక కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఓ భాజపా ఎంపీ ఏకంగా 12 మంది కుటుంబసభ్యులను కోల్పోవడం తీవ్ర విచారకరం. రాజ్‌కోట్‌ ఎంపీ మోహన్‌భాయ్‌ కల్యాణ్‌జీ కుందారియా సోదరి కుటుంబసభ్యులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.

ఈ దుర్ఘటన గురించి కుందారియా మాట్లాడుతూ.. ‘‘తీగల వంతెన కూలిన ప్రమాదంలో నేను 12 మంది కుటుంబసభ్యులను కోల్పోయాను. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. వారంతా నా సోదరి కుటుంబానికి చెందినవారు’’ అని ఉద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బాధితులను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా వంతెన అనుమతుల గురించి వస్తోన్న వార్తలపైనా ఎంపీ స్పందించారు. ‘‘ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. బాధ్యులను శిక్షిస్తాం. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉన్నారు’’ అని విచారం వ్యక్తం చేశారు.

మోర్బీ నగరంలో మచ్చు నదిపై ఉన్న బ్రిటిష్‌ పాలన కాలం నాటి ఓ తీగల వంతెన ఆదివారం సాయంత్రం కూలిన విషయం తెలిసిందే. దీపావళి సెలవులకు తోడు ఆదివారం కూడా కావడంతో ఈ వంతెన వద్ద పర్యాటకుల రద్దీ బాగా కనిపించింది. సందర్శకుల సంఖ్య మరీ ఎక్కువ కావడంతో.. అధిక బరువును మోయలేక వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. అయితే కొన్నేళ్ల పాటు నిరుపయోగంగా ఉన్న ఈ వంతెనకు దాదాపు 7 నెలల పాటు మరమ్మతులు చేసి ఈ నెల 26నే తిరిగి తెరిచారు. ఈలోపే ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని