Pritam Munde: ఆ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి: భాజపా ఎంపీ డిమాండ్‌!

మైనారిటీ వర్గాలకు స్కాలర్‌షిప్‌ల(scholarships)ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విపక్షాలతో పాటు అధికార పార్టీ నుంచి కూడావ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ భాజపా ఎంపీ ప్రీతమ్‌ ముండే కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. 

Published : 15 Dec 2022 18:56 IST

దిల్లీ: దేశంలో మైనారిటీ వర్గాలకు అందిస్తోన్న స్కాలర్‌షిప్‌ల(scholarships)ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని భాజపా ఎంపీ ప్రీతమ్‌ ముండే(Pritam Munde) వ్యతిరేకించారు. ఈ నిర్ణయంపై పునరాలోచించి ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. మహారాష్ట్రలోని బీద్‌ నుంచి లోక్‌సభ(Lok Sabha)కు ఎన్నికైన ప్రీతమ్‌.. గురువారం మైనార్టీల ఉపకారవేతనాలు రద్దు అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉన్నత విద్య అభ్యసిస్తున్న మైనారిటీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మౌలానా ఆజాద్ ఫెలోషిప్ రద్దు చేశారని.. అలాగే,  1 నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకు సైతం ప్రీ-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లను ఎత్తివేయడంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఎలాంటి సమాచారం లేకుండా కేంద్రం నిర్ణయం తీసుకుందని.. ఈ ఏడాది కూడా వేలాది మంది విద్యార్థులు ఈ ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేసుకున్నారని సభదృష్టికి తీసుకెళ్లారు. ఉపకారవేతనాల రద్దు అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని ప్రీతమ్‌ డిమాండ్‌ చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8వ తరగతి చదువుతున్న వారికి విద్య ఉచితమే అయినా.. ఉపకారవేతనాలు ఇస్తే పాఠశాలల్లో విద్యార్థులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు బాల కార్మికులుగా మారకుండా ఉండటంతో పాటు బడిబాట పట్టేందుకు ఉపకార వేతనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్న కోణంలో ఆలోచించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. 

ముస్లిం, బౌద్ధ, జైన, క్రైస్తవ, సిక్కు, పార్సీ విద్యార్థులు పీహెచ్‌డీ కోర్సులు చదవడానికి ఇచ్చే అయిదేళ్ల మౌలానా ఆజాద్‌ ఫెలోషిప్‌ను రద్దు చేయడం, ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతనాలనూ నిలిపివేయడంపై లోక్‌సభలో నిన్న పలువురు విపక్ష ఎంపీలు గళమెత్తిన విషయం తెలిసిందే. మైనారిటీలు వెనుకబడిపోతే దేశం ఎలా పురోగమిస్తుందంటూ వారంతా కేంద్రాన్ని ప్రశ్నించారు. రద్దు చేసిన ఉపకార వేతనాలను తక్షణం పునరుద్ధరించడంతోపాటు మైనారిటీ విద్యార్థులకు బడ్జెట్‌ కేటాయింపులను పెంచాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ (జేఎన్‌యూ) అధ్యాపక సంఘం కూడా మైనారిటీలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. జేఎన్‌యూ, జామియా మిల్లియా తదితర విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు సోమవారం కేంద్ర విద్యా శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని