Varun Gandhi: అప్పటిదాకా రైతులపై దోపిడీ ఆగదు.. వరుణ్‌ గాంధీ మరో ట్వీట్‌

నూతన సాగు చట్టాల విషయంలో రైతులకు మద్దతుగా నిలుస్తూ గత కొంతకాలంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ తాజాగా మరో ట్వీట్‌ చేశారు.

Published : 29 Oct 2021 14:48 IST

దిల్లీ: నూతన సాగు చట్టాల విషయంలో రైతులకు మద్దతుగా నిలుస్తూ గత కొంతకాలంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ తాజాగా మరో ట్వీట్‌ చేశారు. ‘‘కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీ లభించనంతవరకూ మండీల్లో రైతులు దోపిడీకి గురవుతూనే ఉంటారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని వరుణ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

నూతన సాగు చట్టాలను రద్దు చేయడంతో పాటు కనీస మద్దతు ధరపై చట్టబద్ధ హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ దాదాపు ఏడాదికాలంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ అంశాల్లో కేంద్రం వైఖరిపై పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన వరుణ్‌.. ఈ విషయంలో పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందంటూ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు.

లఖింపుర్‌లో ఓ రైతు తన ధాన్యం కుప్పకు నిప్పు పెట్టిన వీడియోను షేర్‌ చేసిన ఆయన.. ‘‘తన పంటకు తానే నిప్పు పెట్టుకునే స్థితి వచ్చింది. మన వ్యవస్థ ఎందుకు ఇలాంటి పరిస్థితులకు దారితీస్తోందనే దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. అన్నం పెట్టేవారిని కాపాడుకోలేకపోవడం మనందరి వైఫల్యం. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి’’ అంటూ వరుణ్‌ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. పలు సందర్భాల్లో రైతులకు మద్దతు పలికిన వరుణ్‌ గాంధీ, ఆయన తల్లి మేనకా గాంధీ.. భాజపా కార్యనిర్వాహక కమిటీలో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని