‘పీఎం కిసాన్‌ నిధులు డబుల్‌ చెయ్యండి’.. యోగికి భాజపా ఎంపీ లేఖ

రైతులకిచ్చే పీఎం కిసాన్‌ నిధులను రెట్టింపు చేయాలని, చెరకు ధర పెంచాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ కోరారు.

Published : 13 Sep 2021 01:25 IST

దిల్లీ: రైతులకిచ్చే పీఎం కిసాన్‌ నిధులను రెట్టింపు చేయాలని, చెరకు ధర పెంచాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ కోరారు. ఈ మేరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు సూచిస్తూ ఆదివారం రెండుపేజీల లేఖ రాశారు.

చెరకుకు ప్రస్తుతం క్వింటాకు రూ.315 చెల్లిస్తున్నారని, దాన్ని రూ.400కు పెంచాలని వరుణ్‌ గాంధీ కోరారు. వరి, గోధుమ పండించే రైతులకు కనీస మద్దతు ధర కంటే క్వింటాకు రూ.200 అధికంగా ఇవ్వాలని పేర్కొన్నారు. పీఎం-కిసాన్‌ కింద రైతులకు ఇస్తున్న రూ.6వేలను రెట్టింపు చెయ్యాలని కోరారు. అలాగే, డీజిల్‌ కొనుగోలు రైతులకు భారంగా మారిన నేపథ్యంలో రూ.20 వరకు సబ్సిడీ ఇవ్వాలని లేఖలో యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు.

రైతులకు మద్దతుగా వరుణ్‌ గాంధీ మాట్లాడడం ఇటీవల ఇది రెండోసారి. ఈ నెల 5న యూపీలోని ముజఫర్‌నగర్‌లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మహా పంచాయత్‌ నిర్వహించగా.. ఆ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ వరుణ్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. రైతులతో చర్చలు జరపాల్సిందిగా కోరారు. నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న వారిలో యూపీకి చెందిన చెరకు రైతులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ ఎంపీ సీఎంకు లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని