BJP: ఆపరేషన్‌ యూపీ.. భాజపా ‘పంచతంత్రం’

వచ్చే ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతోంది. ఇందుకోసం ఆయా రాష్ట్రాలకు నేడు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను

Updated : 09 Sep 2021 01:39 IST

ఐదుగురు కేంద్రమంత్రులకు రాష్ట్ర ఎన్నికల బాధ్యతలు

దిల్లీ: వచ్చే ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతోంది. ఇందుకోసం ఆయా రాష్ట్రాలకు నేడు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. భాజపా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల బాధ్యతల కోసం ఏకంగా ఐదుగురు కేంద్రమంత్రులను రంగంలోకి దించుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ను యూపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించగా.. కేంద్రమంత్రులు అనురాగ్‌ ఠాకూర్‌, అర్జున్‌ రాం మేఘ్‌వాల్‌, శోభ కరంద్లాజే, అన్నపూర్ణదేవి యాదవ్‌లతో పాటు ఎంపీ సరోజ్‌ పాండే, హరియాణా మాజీ మంత్రి అభిమన్యులను కో-ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించింది. 

ఇక యూపీలో రీజియన్ల వారీగా సంస్థాగత ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. లోక్‌సభ ఎంపీ సంజయ్‌ భాటియాకు పశ్చిమ యూపీ, పార్టీ జాతీయ ఉప కోశాధికారి సుధీర్‌ గుప్తాకు కాన్పూర్‌ బాధ్యతలు అప్పగించింది. గోరఖ్‌పూర్‌ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ జాతీయ కార్యదర్శి అరవింద్‌ మేనన్‌ పర్యవేక్షిస్తారని పేర్కొంది. 

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు.. లోక్‌సభ ఎన్నికల ముందు సెమీఫైనల్ లాంటిది. ఈ రాష్ట్రం నుంచి అత్యధికంగా 80 మంది లోక్‌సభ సభ్యులున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ భాజపా అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లోనూ జయకేతనం ఎగురవేసేందుకు కాషాయ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. ఇక్కడ భాజపాకు సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ ప్రధాన ప్రత్యర్థులుగా ఉండగా.. కాంగ్రెస్‌ తన ఓటు షేరును పెంచుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. 

పంజాబ్‌పైనా గట్టి దృష్టి..

ఇక పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చే ఏడాదే జరగనున్నాయి. ఈ రాష్ట్ర బాధ్యతలను కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు అప్పగించింది అధిష్ఠానం. కేంద్రమంత్రులు హర్‌దీప్‌సింగ్‌ పురి, మీనాక్షి లేఖి, లోక్‌సభ ఎంపీ వినోద్‌ చావ్డా కో - ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరించనున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. అయితే ప్రస్తుతం ఆ పార్టీలో అంతర్గత విబేధాలు నెలకొన్నాయి. సీఎం అమరీందర్‌ సింగ్‌, పీసీసీ చీఫ్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో వాటిని తమకు అనుకూలంగా మార్చుకుని పార్టీలో కాషాయ జెండా ఎగురవేయాలని భాజపా భావిస్తోంది. కాగా.. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలపై పంజాబ్‌ రైతుల నుంచి భాజపా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుండటం గమనార్హం.

మణిపూర్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకూ..

మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్‌కు అప్పగించారు. మరో కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్‌, అసోం మంత్రి అశోక్‌ సింఘాల్‌ కో-ఇన్‌ఛార్జ్‌లు వ్యవహరిస్తారు. ఉత్తరాఖండ్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ప్రహ్లాద్‌ జోషీ నియమితులయ్యారు. ఆయన నేతృత్వంలో ఎంపీ లాకెట్‌ ఛటర్జీ, పార్టీ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్‌ కో-ఇన్‌ఛార్జ్‌లు పనిచేయనున్నారు. ఇక వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే మరో రాష్ట్రం గోవా బాధ్యతలపై భాజపా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని