Mahua Moitra: ‘నన్ను బహిష్కరిస్తే.. 63 మంది ఎంపీలు ఇంటికెళ్లారు’: భాజపాపై మహువా మొయిత్రా ఫైర్‌

Mahua Moitra: లోక్‌సభలో తనపై బహిష్కరణ వేటు వేసిన భాజపాకు ప్రజలు గట్టి సమాధానం చెప్పారని టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా అన్నారు. 63 మంది ఎంపీలను ఇంటికి పంపించారన్నారు.

Published : 01 Jul 2024 18:40 IST

దిల్లీ: పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) ఎంపీ మహువా మెయిత్రా (Mahua Moitra) గత లోక్‌సభలో బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి మళ్లీ సభలో అడుగుపెట్టిన ఆమె.. నాటి విషయాన్ని ప్రస్తావిస్తూ భాజపాపై విరుచుకుపడ్డారు. తన గొంతును అణచివేసినందుకు ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుందన్నారు.

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఎంపీ మహువా మెయిత్రా సోమవారం ప్రసంగించారు. ‘‘గత లోక్‌సభలో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. నా గళాన్ని అణచివేసేందుకు అధికార పార్టీ ప్రయత్నించింది. సభ్యత్వాన్ని రద్దు చేసి బహిష్కరణ వేటు వేయించింది. కానీ, ఒక ఎంపీని అణగదొక్కినందుకు భాజపా (BJP) భారీ మూల్యం చెల్లించుకుంది. వారికి ప్రజలు సరైన సమాధానమిచ్చారు. ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన 63 మంది ఎంపీలను ప్రజలు ఇంటికి పంపించారు’’ అని దుయ్యబట్టారు. ప్రస్తుత ప్రభుత్వంలో భాజపాకు స్పష్టమైన మెజార్టీ లేదని, మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తిందని ఎద్దేవా చేశారు. ఏదో ఒక రోజు ఈ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని మహువా (TMC MP Mahua Moitra) ఆరోపించారు.

లోక్‌సభలో రాహుల్‌ ప్రసంగం.. ప్రధాని మోదీ అభ్యంతరం

లోక్‌సభ (Lok Sabha)లో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని, ఆమె పార్లమెంట్ లాగిన్‌ వివరాలను దుబాయ్‌ నుంచి యాక్సెస్‌ చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎథిక్స్‌ కమిటీ.. మహువా మొయిత్రాతో పాటు ఆమెపై ఫిర్యాదు చేసిన భాజపా ఎంపీ నిషికాంత్‌ దుబే, న్యాయవాది జై అనంత్‌ దెహద్రాయ్‌ (మహువా మాజీ మిత్రుడు)ను కమిటీ విచారించింది. ఆమె అనైతిక ప్రవర్తనకు, సభా ధిక్కరణకు పాల్పడినట్లు గుర్తించి నివేదిక ఇచ్చింది. దీంతో స్పీకర్ ఆమెపై బహిష్కరణ వేటు వేశారు.

ఈ అంశం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహువా మెయిత్రా మరోసారి పోటీ చేశారు. పశ్చిమ బెంగాల్‌ నుంచి కృష్ణానగర్‌ స్థానం నుంచి భాజపా అభ్యర్థి అమృతా రాయ్‌పై విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని