Satyendar Jain: మళ్లీ జైన్‌ జైలు వీడియోల కలకలం..!

ఆప్‌ మంత్రి సత్యేందర్‌ జైన్‌కు సంబంధించి మరో జైలు వీడియో వెలుగులోకి వచ్చింది. దీనిని భాజపా నేత ఒకరు ట్విటర్‌లో షేర్ చేశారు. 

Published : 27 Nov 2022 01:36 IST

దిల్లీ: ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న ఆప్‌ నేత, దిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజా వీడియోలో అప్పటి జైలు సూపరింటెండెంట్‌ అజిత్ కుమార్‌ మంత్రిని కలిసినట్లు కనిపిస్తోంది. జైల్లో జైన్‌కు వీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం ఆయనపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే.  

తాజా వీడియోను భాజపా ట్విటర్‌లో షేర్ చేసింది. అందులో పలువురు జైలు గదిలో మంత్రితో మాట్లాడుతున్నారు. సందర్శన వేళలు దాటిన తర్వాత అజిత్‌ కుమార్‌ ఆయనను కలిసినట్లు తెలుస్తోంది. అజిత్‌ రాగానే మిగతావారంతా బయటకు వెళ్లిపోయారు. ‘తిహాడ్‌ జైలుకు సంబంధించి మరో వీడియోను మీడియా బయటపెట్టింది. ఈసారి ఆ ఫుటేజ్‌లో సత్యేందర్‌ దర్బార్‌లో జైలు సూపరింటెండెంట్‌ కనిపిస్తున్నారు. ఇప్పటికే ఆయన సస్పెండ్ అయ్యారు. రేపిస్టుతో మర్దనా చేయించుకోవడం, లగ్జరీ ఆహారం తర్వాత ఈ దృశ్యాలు వచ్చాయి. ఇదేనా అవినీతిపై ఆప్‌ జరిపే పోరాటం..? దీనిని కేజ్రీవాల్ సమర్థించుకుంటారా..? జైన్‌ను తొలగిస్తారా..?’ అని భాజపా అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా విమర్శలు గుప్పించారు.

ఇదిలా ఉంటే.. జైలు సీసీటీవీ దృశ్యాలు మీడియాలో చక్కర్లు కొట్టడంపై జైన్ కోర్టును ఆశ్రయించారు. అవి మీడియాలో ప్రచురితం కాకుండా చూడాలని, అసలు అవి ఎలా లీక్‌ అయ్యాయో తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

ఆ వీడియోలకు సమాధానం ఇదే: కేజ్రీవాల్‌

జైన్‌ గురించి వరుసగా వెలుగులోకి వస్తోన్న వీడియోలను ఉద్దేశించి ఆప్‌ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ స్పందించారు. వాటికి తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ‘ఈ ఎంసీడీ ఎన్నికలు భాజపా 10 వీడియోలకు, ఆప్‌ 10 హామీలకు మధ్య పోటీగా మారింది. డిసెంబర్ 4 వరకు ఆగుదాం. ఈ వీడియోలకు ప్రజలే  సమాధానం ఇస్తారు’అని భాజపా విమర్శలకు కౌంటర్ ఇచ్చారు . దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం కోసం ఆప్‌, భాజపా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వచ్చే నెల  నాలుగో తేదీన ఈ ఎన్నికలు జరగనున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని