Congress: దేశం పేదరికంలో ఉంటే భాజపా ఆస్తులు 550% పెరిగాయ్‌..!

ఓ వైపు పేద, మధ్యతరగతి ప్రజలు మరింత పెదరికంలో మగ్గిపోతుంటే భారతీయ జనతా పార్టీ ఆస్తులు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ దుయ్యబట్టింది

Updated : 29 Jan 2022 12:28 IST

కాషాయ పార్టీపై కాంగ్రెస్‌ ధ్వజం

దిల్లీ: ఓ వైపు పేద, మధ్యతరగతి ప్రజలు మరింత పెదరికంలో మగ్గిపోతుంటే భారతీయ జనతా పార్టీ (BJP) ఆస్తులు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్‌ (Congress) పార్టీ దుయ్యబట్టింది. దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీల ఆస్తుల వివరాలపై అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) శుక్రవారం నివేదిక విడుదల చేసింది. మొత్తం 51 పార్టీల ఆస్తులన్నింటిని కలిపి లెక్కిస్తే రూ.9,117.95 కోట్లు ఉండగా.. ఇందులో ఒక్క భాజపా ఆస్తులే రూ.4,847.78 కోట్లు (53.16%)గా ఉన్నాయి.

దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. కాషాయపార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘ 2013-14లో భాజపా ఆస్తులు రూ.780 కోట్లు. 2019-20 నాటికి కాషాయ పార్టీ ఆస్తుల విలువ రూ.4,847 కోట్లు. దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలు మరింత పేదరికంలోకి వెళ్తుంటే.. కేవలం భాజపా ఆస్తులు మాత్రం 550శాతం పెరిగాయి. నవ భారతానికి ‘మోదీ మోడల్‌’ అంటే ఇదేనేమో..! దేశం నిజంగా మారుతోంది’’ అని సుర్జేవాలా దుయ్యబ్టటారు.

2019-20 సంవత్సరానికి సంబంధించి దేశంలోని ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల లెక్కలకు సంబంధించిన వివరాలపై ఏడీఆర్‌ నిన్న నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా భాజపా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత రూ. 689.33 కోట్లతో బీఎస్పీ రెండో స్థానంలో ఉండగా.. కాంగ్రెస్‌ ఆస్తులు రూ. 588.16కోట్లుగా ఉన్నాయి. ఇక అప్పుల్లో హస్తం పార్టీ మొదటి స్థానంలో ఉంది. ఈ పార్టీకి రూ.49.55కోట్ల రుణాలు ఉండగా.. రూ.30.342 కోట్ల అప్పులతో తెదేపా రెండోస్థానంలో ఉంది. తెరాసకు రూ.4.41 కోట్లు అప్పులు ఉండగా.. వైకాపా అప్పులను నివేదికలో పొందుపర్చలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని