Chandigarh: చండీగఢ్‌కు అమిత్ షా ‘గుడ్‌న్యూస్‌’.. భాజపా భయపడుతోందన్న ఆప్‌..!

పంజాబ్‌ రాజధాని, కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌లో వరాలు కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు ‘గుడ్‌ న్యూస్‌’ అంటూ ప్రకటించారు.

Updated : 28 Mar 2022 13:20 IST

దిల్లీ: పంజాబ్‌ రాజధాని, కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌లో వరాలు కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు ‘గుడ్‌ న్యూస్‌’ అంటూ ప్రకటించారు. అయితే ఇది కాస్తా రాజకీయ దుమారానికి దారి తీసింది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. తమను చూసి భాజపా భయపడుతోందని ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

చండీగఢ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు వెళ్లిన అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ‘‘చండీగఢ్‌ పరిపాలన విభాగంలో పనిచేస్తోన్న ఉద్యోగులకు తీపి కబురు చెబుతున్నా. చండీగఢ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేసే ఉద్యోగుల సర్వీస్‌ నిబంధనలు కేంద్ర సివిల్‌ సర్వీసులకు అనుగుణంగా ఉంటాయి. ఈ నిర్ణయంతో మీరు భారీగా ప్రయోజనాలు పొందుతారు. అంతేగాక, మహిళా ఉద్యోగులు తమ పిల్లల సంరక్షణ కోసం ప్రస్తుతమున్న ఏడాది సెలవులు కూడా రెట్టింపవుతాయి’’ అని షా వెల్లడించారు. ఏప్రిల్‌ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఈ నిర్ణయంతో చండీగఢ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 58 నుంచి 60కి పెరగనుంది. దీంతో పాటు మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయి.

అయితే ఈ ప్రకటన రాజకీయ వివాదానికి తెర లేపింది. ‘‘చండీగఢ్‌ పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని. తాత్కాలికంగా కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగుల్లో 60 శాతం పంజాబ్‌ నుంచి మిగతా వారు హరియాణా నుంచి ఉన్నారు. పునర్‌వ్యవస్థీకరణ సమయంలో ఇక్కడ ఉద్యోగులకు పంజాబ్‌ ప్రభుత్వ నిబంధనలే అమలు చేయాలని ఒప్పందం చేశారు. కానీ ఈ రోజు కేంద్రం నియంతృత్వ ధోరణిలో వ్యవహరించింది. పంజాబ్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని శిరోమణి అకాలీదళ్‌ సీనియర్‌ నేత దల్జిత్‌ సింగ్ ఆరోపించారు. ఇతర రాజకీయ పార్టీలు కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించాయి.

భాజపాకు భయం పట్టుకుంది..

మరోవైపు పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. భాజపాపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆప్‌ను చూసి భాజపా భయపడుతోందని, అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆ పార్టీ సీనియన్‌ నేత, దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఎద్దేవా చేశారు. ‘‘2017 నుంచి 2022 వరకు పంజాబ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. అప్పుడు చండీగఢ్‌పై అమిత్ షా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాగానే ఇలాంటి ప్రకటన చేశారు. ఆప్‌ విస్తరణ చూసి భాజపా భయపడుతోంది’’ అని సిసోడియా దుయ్యబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని