Bridge Collapse: రూ.1700 కోట్ల వంతెన కూల్చివేత.. గార్డు గల్లంతు..

Bihar Bridge Collapse: బిహార్‌లో సెకన్ల వ్యవధిలో కూల్చిన ఓ వంతెన రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే ఈ ఘటనలో ఓ గార్డు గల్లంతైనట్లు తెలుస్తోంది.

Updated : 05 Jun 2023 13:54 IST

పట్నా: బిహార్‌ (Bihar)లో నిర్మాణంలో ఉన్న ఓ వంతెనను.. డిజైన్ లోపాలతో కూల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు. దీని తర్వాత సమీపంలో విధులు నిర్వర్తిస్తోన్న ఓ గార్డు ఆచూకీ గల్లంతైనట్లు తెలిపారు. (Bihar Bridge Collapse)

భాగల్‌పుర్‌, ఖగడియా జిల్లాలను కలుపుతూ నిర్మిస్తున్న అగువానీ - సుల్తాన్‌గంజ్‌ వంతెన పిల్లర్లు గత ఏప్రిల్‌ నెలలో తుపాను కారణంగా కొంతభాగం దెబ్బతిన్నాయి. బిహార్‌(Bihar) ప్రభుత్వం వంతెన నిర్మాణానికి రూ.1,717 కోట్లు కేటాయించింది. 2015లో నీతీశ్‌కుమార్‌(Chief Minister's Nitish Kumar) శంకుస్థాపన చేసిన ఈ నిర్మాణం 2020 నాటికి పూర్తికావాల్సి ఉండగా, ఇప్పటికీ అసంపూర్తిగానే ఉంది. ఈ క్రమంలో డిజైన్ లోపాలతో ఆదివారం దానిని కూల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు. దాంతో అది ఒక్కసారిగా నదిలోకి కుప్పకూలిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే ఆ వంతెనకు సమీపంలో పనిచేస్తున్న గార్డు ఒకరు గల్లంతయ్యారు. ‘వంతెన కూలిన తర్వాత నుంచి ఎస్‌పీ సింగ్లా సంస్థ తరఫున గార్డ్‌గా విధులు నిర్వర్తిస్తోన్న ఓ వ్యక్తి కనిపించకుండా పోయారు. ఇప్పటివరకు అతడి ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం అతడి కోసం గాలింపు జరుగుతోంది’అని అధికారులు తెలిపారు.

ఇక ఈ వంతెన కూల్చివేతపై భాజపా తీవ్ర విమర్శలు గుప్పించింది. ‘ఈ ఘటనపై జవాబుదారీ అవసరం. ఈ ప్రభుత్వంలో కమీషన్లు తీసుకునే సంప్రదాయం ఉంది. బిహార్ సీఎం నీతీశ్ కుమార్‌(Chief Minister's Nitish Kumar)కు రాజకీయ స్థిరత్వం లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగింది. ఆయన వల్ల రాష్ట్రంలో అరాచక పాలన, అవినీతి నెలకొన్నాయి. ఒకవైపు వ్యవస్థలు కుప్పకూలిపోతుంటే..వారు ప్రతిపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్నారు’అని భాజపా మండిపడింది. ‘ఈ వంతెన నిర్మాణం చేపట్టిన సంస్థదే బాధ్యత అంతా. దీనిపై చర్యలు తీసుకోవాలని  అధికారులకు ఆదేశాలు ఇచ్చాం’అని ఇదివరకు సీఎం నీతీశ్ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని