Sardar Vallabhbhai Patel: ‘పటేల్‌ను అవమానించి.. కాంగ్రెస్‌ పాపం చేసింది..!’

కాంగ్రెస్‌ ప్రముఖ నేత, ఉక్కు మనిషి సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ను అవమానించి కాంగ్రెస్‌ పార్టీ పాపం చేసిందని భారతీయ జనతాపార్టీ దుయ్యబట్టింది. గాంధీ కుటుంబాన్ని

Published : 18 Oct 2021 21:31 IST

భాజపా ఘాటు విమర్శలు

దిల్లీ: భారతదేశ తొలి హోంమంత్రి, ఉక్కు మనిషి సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ను అవమానించి కాంగ్రెస్‌ పార్టీ పాపం చేసిందని భారతీయ జనతాపార్టీ దుయ్యబట్టింది. గాంధీ కుటుంబాన్ని పొగడటం కోసం పటేల్‌పై విమర్శలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించింది. ఈ చర్యకు పాల్పడిన వారిపై కాంగ్రెస్‌ అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందా అని ప్రశ్నించింది.

అసలేం జరిగిందంటే..

గత వారాంతంలో కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ భేటీలో పాల్గొన్న జమ్మూకశ్మీర్‌ నేత తారిఖ్‌ హమీద్‌ కర్రా.. పటేల్‌పై విమర్శలు చేసినట్లు కొన్ని జాతీయ మీడియాల్లో కథనాలు వచ్చాయి. వీటిపై భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా సోమవారం స్పందిస్తూ.. హస్తం పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

‘‘సీడబ్ల్యూసీ భేటీలో సర్దార్‌ పటేల్‌పై కర్రా చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. సర్దార్‌ పటేల్‌ పాకిస్థాన్‌ వ్యవస్థాపకుడు జిన్నాను కలిశారని ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌ భారత్‌లో భాగంగా ఉండాలని జవహార్‌లాల్‌ నెహ్రూ కోరుకుంటే.. పటేల్‌ మాత్రం వేరుచేయాలని అనుకున్నారని కర్రా విమర్శించారు. నెహ్రూను పొగడటం కోసం, గాంధీ కుటుంబం మన్నన పొందడం కోసం పటేల్‌ను విలన్‌ చేశారు’’ అని సంబిత్‌ పాత్రా దుయ్యబట్టారు. పటేల్‌ లాంటి గొప్ప వ్యక్తిని అవమానిస్తుంటే సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ అభ్యంతరం చెప్పారా? అని ప్రశ్నించారు. దీనిపై సోనియా గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

అయితే పటేల్‌ను అవమానించారంటూ వచ్చిన వార్తలను కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది. మోదీ ప్రభుత్వం తరఫున కొన్ని మీడియా సంస్థలు కావాలనే ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సర్జేవాలా మండిపడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని