Nupur Sharma: భాజపా బహిష్కృత నేత నుపుర్‌ శర్మకు గన్‌ లైసెన్స్‌

భాజపా బహిష్కృత నేత నుపుర్‌ శర్మకు గన్‌ లైసెన్సు జారీ అయ్యింది. తన ప్రాణాలకు హాని ఉందని ఆమె చేసిన విజ్ఞప్తి మేరకు ఈ లైసెన్సును జారీ చేసినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు.

Published : 13 Jan 2023 01:55 IST

దిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే కారణంగా తమ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మను భాజపా గతేడాది సస్పెండ్‌కు గురైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలోనే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తడంతోపాటు ఆమెకు చంపుతామనే బెదిరింపులు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమెకు తాజాగా దిల్లీ పోలీసులు గన్‌ లైసెన్సును జారీ చేశారు. తన ప్రాణాలకు హాని ఉందని.. స్వీయ రక్షణ కోసం తుపాకీ కావాలనే విజ్ఞప్తి మేరకు ఆమెకు ఈ లైసెన్స్‌ జారీ చేసినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు.

గతేడాది మే నెలలో ఓ టీవీ ఛానల్‌లో చర్చా కార్యక్రమంలో నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంలోనే గాక, అంతర్జాతీయంగా విమర్శలకు దారితీశాయి. అదే సమయంలో  భారత్‌లో నుపుర్‌ శర్మకు మద్దతుగా నిలిచిన వారిపైనా దాడులు కొనసాగాయి. మహారాష్ట్ర అమరావతిలో ఓ ఫార్మసిస్ట్‌ హత్యకు గురికాగా, ఉదయ్‌పుర్‌లో ఓ టైలర్‌ కూడా హత్యకు గురయ్యాడు. తర్వాత ఆమెను  హత్యచేస్తామంటూ బెదిరింపులు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఆమె దిల్లీ పోలీసులకు విజ్ఞప్తి చేయడంతో ఆమెకు గన్‌ లైసెన్సును జారీ చేశారు.

నుపుర్‌ శర్మ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో భాజపా ఆమెను అప్పట్లోనే సస్పెండ్‌ చేసింది. ఈ వ్యాఖ్యలకుగానూ ఆమెపై దేశంలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. అయితే, కేసుల విచారణ సందర్భంగా నుపుర్‌ శర్మపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె నోటి దురుసు దేశాన్ని మంటల్లోకి నెట్టిందని, వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకుంటోన్న దురదృష్టకర సంఘటనలకు ఆమే ఏకైక బాధ్యురాలని పేర్కొంది. చేసిన వ్యాఖ్యలకు దేశం మొత్తానికి ఆమె క్షమాపణలు చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తర్వాత నుపుర్‌ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని