BJP: భుట్టో... ఖబడ్దార్‌! దేశవ్యాప్త నిరసనలకు భాజపా పిలుపు

ప్రధాని మోదీ(PM Modi)పై పాక్‌ విదేశాంగ మంత్రి బిలావుల్‌ భుట్టో చేసిన వ్యాఖ్యల్ని భాజపా తీవ్రంగా ఖండించింది. ఆయన వ్యాఖ్యల్ని నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఆయా రాష్ట్రాల రాజధాని నగరాల్లో పాక్‌, పాక్‌ మంత్రి దిష్టిబొమ్మలు దహనం చేయనున్నారు.

Updated : 16 Dec 2022 20:36 IST

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)పై పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి బిలావుల్‌ భుట్టో(Bilawal Bhutto) వ్యక్తిగతంగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ(BJP) తీవ్రస్థాయిలో స్పందించింది. పాక్‌ మంత్రి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన భాజపా నేతలు.. దిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు భుట్టో క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పాక్‌ విదేశాంగ మంత్రి వ్యాఖ్యల్ని నిరసిస్తూ శనివారం దేశవ్యాప్తంగా నిరసనలకు భాజపా పిలుపునిచ్చింది. భుట్టో వ్యాఖ్యలు సిగ్గుచేటని.. ఆయన వ్యాఖ్యల్నినిరసిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లో పాకిస్థాన్‌, పాక్‌ మంత్రి భుట్టో దిష్టిబొమ్మల్ని శనివారం తగలబెట్టనున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, అక్కడ అన్యాయం, అరాచకాలు రాజ్యమేలడం, సైన్యంలో విభేదాలు, ప్రపంచంతో సంబంధాలు క్షీణిస్తుండటం, ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండటం వల్ల వాటి నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ భాజపా మండిపడింది. 

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం సందర్భంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులతో పాటు కొందరు పాక్‌ విద్యార్థుల్ని సైతం మోదీ సర్కార్‌ కాపాడిన విషయాన్ని ఈ సందర్భంగా భాజపా గుర్తు చేసింది. ఆ మిషన్‌కు ప్రధాని మోదీనే సారథ్యం వహించారని తెలిపింది. అలాంటి ప్రధాని మోదీ పట్ల మంత్రి భుట్టో ఉపయోగించిన భాష తీవ్ర గర్హనీయమని తెలిపింది. అతడు వాడిన భాష రాజనీతిజ్ఞత స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని.. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి అన్ని హద్దులు మీరి మాట్లాడారని మండిపడింది. అసలు గ్లోబల్‌ లీడర్‌గా ఉన్న మోదీ గురించి వ్యాఖ్యానించే స్థాయి ఆయనకు ఉందా అని ప్రశ్నించింది. భుట్టో చేసిన వ్యాఖ్యలతో ఆ దేశ ప్రతిష్ఠ మరింత దిగజారిందని పేర్కొంది. 

పాకిస్థాన్‌.. నీ తీరు మార్చుకో: విదేశాంగ శాఖ

పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో (Bilawal Bhutto) చేసిన వ్యాఖ్యలు అనాగరికమని కేంద్ర విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. పాకిస్థాన్‌వి దిగజారిన వ్యాఖ్యలని మండిపడ్డ భారత్‌.. ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను గుర్తించలేని అసమర్థత ఆయన వ్యాఖ్యల్లో స్పష్టమవుతోందని  విమర్శించింది. ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ తమ చేష్టలను ఇకనైనా మార్చుకుని, పొరుగు దేశాల పట్ల స్నేహంగా ఉండాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ హితవు పలకడంపై స్పందిస్తూ పాక్‌ విదేశాంగశాఖ మంత్రి ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని అనుచిత వ్యాఖ్యలు చేయడంపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. 

‘పాకిస్థాన్‌ (Pakistan) మంత్రి 1971లో ఈ రోజును మర్చిపోయారు. బెంగాలీలు, హిందువుల పట్ల పాకిస్థాన్‌ పాలకుల మారణహోమానికి ఇది ప్రత్యక్ష ఫలితం. దురదృష్టవశాత్తు.. పాక్‌ తన మైనారిటీల పట్ల వ్యవహరించే విషయంలో పెద్దగా మారినట్లు కనిపించడం లేదు. ఇప్పుడు ప్రధాన అంతర్జాతీయ అజెండా ఉగ్రవాద నిరోధక చర్యలే. కానీ, ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు  ఆశ్రయం కల్పించడం, ఆర్థిక సాయం అందించడంలో పాక్‌ తిరుగులేని పాత్ర. న్యూయార్క్‌, ముంబయి, పుల్వామా, పఠాన్‌కోట్‌, లండన్‌ ఇలా ఎన్నో నగరాలు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద మచ్చలు కలిగి ఉన్నాయి. ఈ హింస.. పాక్‌ ప్రత్యేక ఉగ్రవాద జోన్ల నుంచి పుట్టుకొచ్చింది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు పాకింది. ‘మేక్ ఇన్ పాకిస్థాన్’ ఉగ్రవాదాన్ని అరికట్టాల్సి ఉంది’ అని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ (Arindam Bagchi) ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

‘ఒసామా బిన్ లాడెన్‌(Osama bin Laden)ను అమరవీరుడని కీర్తిస్తూ.. లఖ్వీ, హఫీజ్ సయీద్, మసూద్ అజార్, సాజిద్ మీర్‌, దావూద్ ఇబ్రహీం వంటి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశం పాకిస్థాన్. ఐరాస ప్రకటిత 126 మంది ఉగ్రవాదులు, 27 ఉగ్రవాద సంస్థలను కలిగి ఉన్నామని మరే ఇతర దేశం గొప్పగా చెప్పుకోదు! పాక్‌ ఉగ్రవాది అజ్మల్ కసబ్ బుల్లెట్ల నుంచి 20 మంది గర్భిణులను కాపాడిన ముంబయి నర్సు అంజలి కుల్తే సాక్ష్యాన్ని ఐరాస భద్రతా మండలిలో పాక్‌ మంత్రి విని ఉండాల్సింది. కానీ, తన దేశ పాత్రను మాయం చేసేందుకు ఆయన ఎక్కువ ఆసక్తి చూపారు. ఉగ్రవాదాన్ని తమ దేశ విధానంలో భాగంగా మార్చుకున్న పాక్‌ మంత్రి.. తన దేశ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి’ అని బాగ్చి విమర్శలు గుప్పించారు.

భుట్టో వ్యాఖ్యలపై మంత్రుల ఫైర్‌!

ప్రధాని మోదీని టార్గెట్‌ చేస్తూ పాక్‌ విదేశాంగ మంత్రి భుట్టో చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మండిపడ్డారు. 1971లో భారత సైన్యం చేతిలో పాకిస్థాన్‌ ఓడిపోయినందుకు ఇంకా అతడు బాధలోనే ఉన్నాడేమో అంటూ చురకలంటించారు. చాలాకాలంగా ఉగ్రవాదులకు ఆశ్రయంకల్పిస్తున్నారంటూ మండిపడ్డారు. పాకిస్థాన్‌ చర్యలను, ఉద్దేశాలను యావత్‌ ప్రపంచం గమనిస్తోందన్నారు. పాకిస్థాన్‌ చాలాకాలంగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పారు. ఒసామా బిన్‌లాడెన్‌ను అమెరికా పాకిస్థాన్‌లోనే మట్టుబెట్టిందని.. అలాగే, పాకిస్థాన్‌లో భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసిందని గుర్తు చేశారు.  మరోవైపు, పాక్‌మంత్రి వ్యాఖ్యల్ని కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి మీనాక్షి లేఖి తీవ్రంగా ఖండించారు.ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్‌కు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారంటూ మండిపడ్డారు.ఒక దేశ విదేశాంగ మంత్రి ఇలాంటివ్యాఖ్యలు చేయడం తగదని.. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ పాకిస్థాన్‌ ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రేలిస్ట్‌లో అనేక ఏళ్లుగా కొనసాగుతూ వచ్చిందని  విమర్శలు గుప్పించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు