Mehbooba Mufti: ఓట్ల కోసమే అఫ్గాన్‌, తాలిబన్ల ప్రస్తావన.. భాజపాపై మెహబూబా ముఫ్తీ ఆరోపణలు

ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నందున ఓట్ల కోసం.. తాలిబన్లు, అఫ్గానిస్థాన్‌ తదితర అంశాలపై భాజపా రాజకీయాలు చేస్తోందని పీడీపీ అధ్యక్షురాలు, జమ్మూ- కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆరోపించారు...

Updated : 20 Sep 2021 05:57 IST

శ్రీనగర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నందున ఓట్ల కోసం.. తాలిబన్లు, అఫ్గానిస్థాన్‌ తదితర అంశాలపై భాజపా రాజకీయాలు చేస్తోందని పీడీపీ అధ్యక్షురాలు, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఒకవేళ ఈ అంశాలు పనిచేయడం లేదని భావిస్తే.. పాకిస్థాన్‌, డ్రోన్లు, జమ్మూ కశ్మీర్‌ను తెరపైకి తీసుకొస్తుందన్నారు. లద్ధాఖ్‌లో చైనా దురాక్రమణపై మాత్రం మాట్లాడదని.. ఎందుకంటే ఈ అంశం ఓట్లు తెచ్చిపెట్టదు కదా ఎద్దేవా చేశారు. పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జమ్మూలో నిర్వహించిన ర్యాలీని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. భాజపా పాలనలో ప్రజాస్వామ్యం, దేశం ప్రమాదంలో ఉన్నాయని పేర్కొన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన మంచినంతా పోగొట్టారని ధ్వజమెత్తారు.

సోనూసూద్‌ లాంటివారికీ తప్పడం లేదు..

భాజపా ఏడేళ్ల పాలన ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టిందని, ముఖ్యంగా జమ్మూ- కశ్మీర్‌ను నాశనం చేసిందని ముఫ్తీ విమర్శించారు. ప్రభుత్వ సంస్థల విక్రయంతోపాటు ఇంధన ధరలు, నిత్యావసరాల ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఖజానా నింపుకొంటోందని ఆరోపించారు. ఆ నగదుతో ప్రతిపక్ష నేతలను కొనడం, వినకపోతే.. వారిని బెదిరించేందుకు ప్రభుత్వ సంస్థలను ఉపయోగిస్తోందన్నారు. కశ్మీర్‌ పౌరులకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కల్పించడం లేదని, దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి ఉందని.. సోనూసూద్‌ లాంటివారూ ఈడీ దాడులు ఎదుర్కొంటున్నారన్నారు. ‘నిరుద్యోగ సమస్య పరిష్కారానికి నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. కానీ, నేను దానికి స్వయం పాలన అని పేరు పెడితే.. దేశ ద్రోహిగా ముద్ర వేస్తార’ని పేర్కొన్నారు. దేశ విభజన సమయంలో భాజపా అధికారంలో ఉండుంటే జమ్మూకశ్మీర్‌ ఎన్నడూ భారత్‌లో చేరేదే కాదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని