Lok Sabha Speaker: స్పీకర్ పదవిపై ఉత్కంఠ.. తమ దగ్గరే ఉండాలనుకుంటున్న భాజపా..!

లోక్‌సభ కార్యకలాపాల నిర్వహణలో స్పీకర్ (Lok Sabha Speaker) పదవి కీలకం. అది తనవద్దే అట్టిపెట్టుకోవాలని భాజపా కోరుకుంటున్నట్లు సమాచారం. 

Updated : 17 Jun 2024 16:33 IST

దిల్లీ: ఈ నెల 24 నుంచి 18వ లోక్‌సభ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఈ సందర్భంగా నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్ (Lok Sabha Speaker) ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో ఆ స్థానంలో కూర్చునే వ్యక్తి ఎవరా అనే చర్చ నడుస్తోంది.

ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తోన్న భాజపా.. స్పీకర్ (Lok Sabha Speaker) పదవిని తనవద్ద అట్టిపెట్టుకోవాలని ఆశిస్తోందని సమాచారం. మోదీ 3.0 ప్రభుత్వ ఏర్పాటులో తెదేపా, జేడీయూ కీలకంగా మారాయి. దాంతో రెండు పార్టీలు ఆ పదవిని ఆశించినట్లు వార్తలు వచ్చాయి. అయితే కమలం పార్టీ మిత్రులకు డిప్యూటీ పోస్టు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి తమ కూటమికి ఇవ్వకపోతే..స్పీకర్ పోస్టుకు అభ్యర్థిని దింపాలని విపక్ష ‘ఇండియా’ కూటమి యోచిస్తున్నట్ల సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

మంత్రివర్గం ఓకే.. ఇంతకీ లోక్‌సభ స్పీకర్‌ ఎవరు..?

అధికార పార్టీకి ఉన్న సంఖ్యాబలం ప్రకారం దానికి చెందిన వ్యక్తే స్పీకర్‌ (Lok Sabha Speaker)గా ఉంటారని జేడీయూ నేత కేసీ త్యాగి వెల్లడించారు. ‘‘దీనిపై ఎన్డీయే భాగస్వాములు మొదట చర్చలు జరుపుతాయి. ఒకసారి అందరి ఆమోదం లభించిన తర్వాత మేం అభ్యర్థిని నిలబెడతాం. ఆ వ్యక్తికి కూటమి పార్టీలన్నీ మద్దతు తెలుపుతాయి’’ అని టీడీపీ పేర్కొంది. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం.. స్పీకర్ పదవి భాజపా వద్దే ఉంటే, రాజస్థాన్‌ కోటా స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఓం బిర్లాకు మరోసారి అవకాశం ఇవ్వొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ భాజపా శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి పేరు కూడా ప్రచారంలో ఉంది. వీరు కాకుండా వేరెవరి పేరైనా కూడా తెరపైకి రావొచ్చని తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని