
ఈశాన్యంలో మళ్లీ కాషాయ రెపరెపలే
తేయాకు తోటలు, ఇంధన వనరులకు నిలయంగా పేరున్న ఈశాన్య రాష్ట్రం అస్సాంలో మరోసారి కాషాయ జెండా రెపరెపలాడింది. వరుసగా రెండోసారి విజయం సాధించిన తొలి కాంగ్రెసేతర పార్టీగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించి ఈశాన్యంపై తమ పట్టును ఘనంగా చాటుకుంది. పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ ప్రధాని మోదీ చరిష్మా.. స్థానిక నాయకుల ప్రాబల్యం మరోసారి కమలనాథులను అధికార పీఠంపై కూర్చోబెట్టాయి.
ఐదేళ్ల క్రితం 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా జయకేతనం ఎగురవేసి సరికొత్త చరిత్ర లిఖించింది. ఈ రాష్ట్రంలో తొలిసారి అధికారాన్ని దక్కించుకుంది. మొత్తం 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీలో ఆ ఎన్నికల్లో భాజపా 60 చోట్ల విజయం సాధించింది. అప్పటివరకు ఈ రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్ కేవలం 26 చోట్ల మాత్రమే నెగ్గింది. మెజార్టీ మార్క్ రాకపోవడంతో అస్సాం గణపరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్)తో కలిసి కాషాయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఏడాది ఎన్నికల ముందు ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతూ బీపీఎఫ్ పార్టీ.. భాజపాకు షాకిచ్చింది. బోడోలాండ్ ప్రాంతంలో ఈ పార్టీకి రెండు దశాబ్దాలుగా గట్టి పట్టుంది. ఎన్డీయేను వీడిన బీపీఎఫ్.. కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమెక్రాటిక్ ఫ్రంట్‌తో కలిసి మహాజోత్(మహాకూటమి)గా ఏర్పడింది.
ప్రత్యర్థుల బలహీనతలే అస్త్రాలు..
బీపీఎఫ్.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం బోడోలాండ్ ప్రాంతంలో భాజపాకు సవాల్‌గా మారింది. దీంతో కాషాయ పార్టీ హిమంత బిశ్వ శర్మను రంగంలోకి దించింది. బోడో వర్గంలో పట్టున్న మరో ప్రాంతీయ పార్టీ యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్(యూపీపీఎల్)తో హిమంతకు స్నేహంతో ఆ పార్టీని కూటమిలో చేర్చుకుంది. అది భాజపాకు కలిసొచ్చింది. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పోరాటమే లక్ష్యంగా పుట్టుకొచ్చిన అసోం జాతీయ పరిషత్, రైజోర్ దళ్ కూడా ఎన్నికల బరిలోకి దిగాయి. దీంతో అటువైపు నుంచి కూడా భాజపాకు పోటీ మొదలైంది.
అయితే కాషాయ పార్టీ మాత్రం తమ వ్యూహాలపై బలంగా ఉంది. సీఏఏ అమలుపై ఓ వైపు పట్టుదలగా ఉంటూనే.. హిందూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్.. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని తమ అస్త్రంగా మలుచుకుని ప్రచారం సాగించింది. ఆ దిశగా ముస్లిం ఓటర్లపైనా ప్రభావం చూపించే ప్రయత్నం చేసింది. ఈ ప్రచారం సీఏఏ, ఎన్నార్సీ అంశాలను వెనక్కి నెట్టేలా చేసింది. ఫలితంగా రెండో పర్యాయం కాషాయ పార్టీకి సునాయస విజయాన్ని అందించేలా చేసింది. దీనికి తోడు కేంద్ర పరిధిలో అస్సాంకు భాజపా ఇతర ప్రధాన రాష్ట్రాలతో సమానంగా ప్రాధాన్యమివ్వడం కూడా ఆ పార్టీకి అదనపు బలంగా మారింది.
హస్తానికి కలిసిరాని పొత్తులు..
ఏళ్ల తరబడి అస్సాంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు మరోసారి రిక్తహస్తమే ఎదురైంది. ఈసారి కూడా ఆ పార్టీకి పొత్తులు కలిసిరాలేదు. ముస్లిం వర్గాల మద్దతు ఉన్నప్పటికీ దాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడంలో హస్తం మళ్లీ విఫలమైంది. అంతేగాక, కూటమిని ముందుండి నడిపించే నాయకులు లేకపోవడం, తరుణ్ గొగొయ్ లాంటి దిగ్గజ నేతల లోటు ఆ పార్టీలో స్పష్టంగా కన్పించింది.
ముఖ్యమంత్రి ఎవరో..
ఎప్పటిలాగే అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే భాజపా ఎన్నికలకు వెళ్లి విజయం సాధించింది. దీంతో సీఎం ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ముఖ్యమంత్రి శర్వానంద సోనోవల్‌ను మరోసారి కొనసాగించే అవకాశాలు తక్కువగా కన్పిస్తున్నాయి. ఈ రేసులో కీలక నేత, రాష్ట్ర మంత్రి పేరు హిమంత విశ్వశర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మరి అస్సాం పగ్గాలను భాజపా ఎవరికి అప్పగిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..!