Black Fungus: పేగుల్లో బ్లాక్‌ ఫంగస్‌

ఇద్దరు బాధితుల పేగుల్లో మ్యుకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌)ను గుర్తించినట్లు దిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆసుపత్రి వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న ఇద్దరి చిన్న పేగుల్లో ఈ ఫంగస్‌ను గుర్తించినట్లు....

Published : 22 May 2021 21:45 IST

దిల్లీ ఆసుపత్రిలో ఇద్దరు రోగుల్లో గుర్తింపు

దిల్లీ: ఇద్దరు బాధితుల పేగుల్లో మ్యుకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌)ను గుర్తించినట్లు దిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆసుపత్రి వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న ఇద్దరి చిన్న పేగుల్లో ఈ ఫంగస్‌ను గుర్తించినట్లు సర్‌ గంగారామ్‌ ఆసుపత్రి శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు ముక్కు, సైనస్‌ ప్రాంతాల్లోనే బ్లాక్‌ ఫంగస్‌ను గుర్తించామని.. కానీ తాజాగా ఇద్దరిలో పేగుల్లో వైద్యులు ఈ ఫంగస్‌ను గుర్తించినట్లు వెల్లడించింది. వారిద్దరికి మధుమేహం ఉందని, వారు కొవిడ్‌ నుంచి కోలుకున్నారని.. అందులో ఓ వ్యక్తి స్టెరాయిడ్స్‌ తీసుకున్నట్లు పేర్కొంది.

‘ఇద్దరిలో ఓ వ్యక్తి (56).. కరోనాతో ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయాడు. వైరస్‌ నుంచి కోలుకున్నాక కడుపు నొప్పితో బాధపడ్డాడు. అయితే అతడికి సిటీ స్కాన్‌ నిర్వహించిన వైద్యులు చిన్న పేగులో  మ్యుకర్‌మైకోసిస్‌ను గుర్తించారు. ఫంగస్‌తో చిన్న పేగు చిల్లులు పడినట్లు గుర్తించారు. దీంతో అతడికి శస్త్ర చికిత్స నిర్వహించాలని నిర్ణయించుకున్నాం’ అని ఆ ప్రకటనలో తెలిపింది. రెండో రోగి (68) కూడా కడుపు నొప్పితో బాధపడ్డాడని, అయితే అతడు స్టెరాయిడ్స్‌ తీసుకున్నట్లు వెల్లడించింది. అతడికి కూడా శస్త్రచికిత్స చేసినట్లు వివరించింది.

కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం మే21 నాటికి దేశవ్యాప్తంగా 8,848 బ్లాక్‌ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో అత్యధికంగా 2,281 మందికి ఈ వ్యాధి సోకగా.. మహారాష్ట్రలో 2,000, ఆంధ్రప్రదేశ్‌లో 910 మంది ఈ ఫంగస్‌ బారిన పడ్డారు. పలు రాష్ట్రాల్లో వెలుగుచూస్తోన్న బ్లాక్‌ ఫంగస్‌ కేసుల ఆధారంగా ఆంఫోటెరిసిన్‌-బి ఔషధాన్ని కేటాయించామని కేంద్ర మంత్రి సదానంద గౌడ శనివారం వెల్లడించారు. ఇదేమీ కొత్త వ్యాధి కాకపోయినా.. దీని బారినపడిన వారి పరిస్థితి కొద్ది రోజుల్లోనే  విషమిస్తోందని వైద్యులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని