black fungus: ఔషధం ఉత్పత్తికి సన్నాహాలు

కొవిడ్‌19 నుంచి కోలుకున్న వారిలో కొందరు బ్లాక్‌ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడుతున్నట్లు వస్తోన్న నివేదికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Published : 13 May 2021 01:37 IST

పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరగడంతో అప్రమత్తమైన కేంద్రం

దిల్లీ: కొవిడ్‌19 నుంచి కోలుకున్న వారిలో కొందరు బ్లాక్‌ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడుతున్నట్లు వస్తోన్న నివేదికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్త చర్యగా వీటి చికిత్సలో వియోగించే యాంటీఫంగల్‌ ఔషధ ఉత్పత్తిని భారీ స్థాయిలో పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తయారీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వశాఖ వెల్లడించింది.

బ్లాక్‌ఫంగస్‌ కేసులు దిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్నాయి. దీంతో బ్లాక్‌ఫంగస్‌ బాధితులకు వైద్యులు ఆంఫోటెరిసిన్‌ ఔషధాన్ని సిఫార్సు చేస్తున్నారు. దీంతో పలు రాష్ట్రాల్లో ఈ ఔషధానికి డిమాండ్‌ పెరిగినట్లు గుర్తించామని కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో బ్లాక్‌ఫంగస్‌ చికిత్సలో వాడే ఔషధాల కొరత ఏర్పడకుండా ఉత్పత్తిని భారీగా పెంచేందుకు తయారీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఇప్పటివరకు ఉన్న ఔషధాలను ప్రభుత్వ, ప్రైవేటుతో పాటు ప్రజారోగ్య సంరక్షణ కేంద్రాలకు సమతుల్యంగా పంపిణీ చేసేలా రాష్ట్రాలు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. వీటి లభ్యతకు సంబంధించిన సమాచారాన్ని ఆయా విభాగాలకు ఎప్పటికప్పుడు చేరవేసేలా చూసుకోవాలని రాష్ట్రాలకు తెలిపింది. అన్ని విభాగాలకు ఈ ఔషధ పంపిణీని నేషనల్‌ ఫార్మాస్యూటికల్స్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌ఏపీపీఏ) పర్యవేక్షిస్తుందని కేంద్ర రసాయన మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ఇక దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో కీలకమైన ఔషధాలకు భారీ డిమాండ్‌ ఏర్పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రెమ్‌డెసివిర్‌ ఔషధం కొరత, బ్లాక్‌మార్కెట్‌కు తరలివెలుతుండడం వంటి సమస్యలు బాధితులకు శాపంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్లాక్‌ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందన్న నిపుణుల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని