Afghanistan: అఫ్గాన్‌లోని మసీదులో భారీ పేలుడు.. 16 మంది మృతి!

తాలిబన్ల పాలనలో వరుస పేలుళ్లతో అఫ్గాన్‌ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఇలాంటిదే మరో దాడి జరిగింది. షియాలే లక్ష్యంగా కాందహార్‌ ప్రావిన్స్‌లోని ఇమామ్‌ బర్గా మసీదులో శుక్రవారం జరిగిన భారీ పేలుళ్లలో కనీసం...

Updated : 15 Oct 2021 16:56 IST

కాబుల్‌: తాలిబన్ల పాలనలో వరుస పేలుళ్లతో అఫ్గాన్‌ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఇలాంటిదే మరో దాడి జరిగింది. షియాలే లక్ష్యంగా కాందహార్‌ ప్రావిన్స్‌లోని ఇమామ్‌ బర్గా మసీదులో శుక్రవారం జరిగిన భారీ పేలుళ్లలో కనీసం 16మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 32 మందికిపైగా గాయపడినట్లు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి. క్షతగాత్రులను హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో మసీదు కిక్కిరిసి ఉంది. అదే సమయంలో ఈ దాడి చోటుచేసుకుంది. మరోవైపు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు.

గతంలోనూ పలుమార్లు దాడులు..

గత శుక్రవారమే ఉత్తర అఫ్గానిస్థాన్‌ కుందుజ్‌ ప్రావిన్స్‌ ప్రాంతంలోని ఓ మసీదులో శక్తిమంతమైన పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో కనీసం 60 మంది వరకు దుర్మరణం చెందగా.. భారీ సంఖ్యలో గాయపడ్డారు. అప్పుడూ షియాల మసీదును లక్ష్యంగా చేసుకొని ముష్కరులు దాడికి పాల్పడ్డారు. అఫ్గాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడ ఇస్లామిక్‌ స్టేట్‌ ముఠా దాడులు పెరుగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతంలోనూ అనేకసార్లు షియాలపై ఇస్లామిక్‌ స్టేట్‌ మిలిటెంట్లు దాడిచేసిన సందర్భాలు ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని