
మంచు తుపానుకు టెక్సాస్ గజగజ
28 లక్షల వినియోగదారులకు నిలిచిన విద్యుత్ సరఫరా..
హూస్టన్: అమెరికాలోని టెక్సాస్‌లో మంచు తుపాను తీవ్రత కొనసాగుతోంది. గురువారం వరకు హిమపాతం తగ్గుముఖం పట్టే అవకాశం లేదని వాతావరణ శాఖ అంచనా వేసింది. విద్యుత్ పునరుద్ధరణకు మరింత సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో పరిమితంగా విద్యుత్ పంపిణీ జరుగుతోంది. బయటకు వెళ్లడమే గగనం కాగా... చాలా చోట్ల రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. మంచు తుపాను ప్రభావం గురువారం వరకు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే హోం శాఖకు ఆదేశాలు జారీ చేశారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. అయితే విద్యుత్ పునరుద్ధరణపై ఇంకా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. శీతల వాతావరణం కారణంగా సంస్థలు ఏ రకంగానూ విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేకపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. ‘‘విద్యుత్ పునరుద్ధరణ త్వరగా జరుగుతుందని ఎవరూ ఆశించకండి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరింత సమయం పట్టే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ నిలిచిపోయే పరిస్థితి రాకూడదంటే అందరూ వీలైనంత వరకు విద్యుత్ వినియోగానికి దూరంగా ఉండండి’’ అని హూస్టన్ మేయర్ సిల్వస్టర్ టర్నర్ పేర్కొన్నారు. మరోవైపు తుపాను ప్రభావం కొవిడ్ టీకా పంపిణీపైనా పడింది. హారిస్ కౌంటీ సహా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల కొవిడ్ టీకాలు పాడయ్యే ప్రమాదం ఉంది. నష్ట నివారణపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
విమానాలు బంద్
మంచు తుపాను కారణంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా... వందల విమానాలు రద్దయ్యాయి. తుపాను ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం సుమారు 120 రోడ్డు ప్రమాదాలు జరిగాయని అధికారులు వెల్లడించారు.
టోర్నడో ధాటికి ముగ్గురి మృతి
ఉత్తర కరోలినాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. దీని కారణంగా పెనుగాలులు సంభవించడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు విద్యుత్ పంపిణీలో జాప్యం కారణంగా లక్షలాది మంది ప్రజలు అవస్థలు పడుతున్నారు. మంచు తుపాను కారణంగా ప్రజలు బయటకు రాకుండా ఇళ్ల వద్దనే ఉండాలని.. అధికారులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.