Modi: నీరు, నెత్తురు కలిసి ప్రవహించలేవు: ‘సింధూ జలాల’పై ఆనాడే హెచ్చరించిన మోదీ

సింధూ జలాల ఒప్పందాన్ని (Indus water treaty) సవరించుకోవడంపై భారత్‌ ఆరేళ్ల కిందటే పునరాలోచన చేసినట్లు తాజాగా తెలిసింది. 2016లో ఉరి ఉగ్రదాడి ఘటన తర్వాత మోదీ దీని గురించి అధికారులను హెచ్చరించారట..!

Updated : 28 Jan 2023 15:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్ (India)‌, పాకిస్థాన్‌ మధ్య ఆరు దశాబ్దాలుగా ఉన్న ‘సింధూ జలాల ఒప్పందాన్ని (ఐడబ్ల్యూటీ)’ మార్చేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పాక్‌కు నోటీసు కూడా జారీ చేసింది. అయితే ఈ ఒప్పందాన్ని (Indus water treaty) సవరించాలన్న నిర్ణయం ఈ నాటిది కాదు. 2016లోనే మోదీ సర్కారు దీనిపై పునరాలోచన చేసినట్లు తెలుస్తోంది. ఉరిలోని సైనిక క్యాంప్‌పై ఉగ్రదాడి తర్వాత సింధూ జలాల ఒప్పంద సమీక్షలో భారత ప్రధాని మోదీ (Modi) మాట్లాడుతూ.. ‘‘నీరు, నెత్తురు కలిసి ప్రవహించలేవు’ అని అధికారులతో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. నాటి హెచ్చరికలే ఇప్పుడు ప్రతిధ్వనిస్తున్నట్లు తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది.

2016 సెప్టెంబరులో జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోని ఉరి సైనిక స్థావరంపై పాక్‌ (Pakistan) కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు భీకర దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 18 మంది ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటన జరిగిన సరిగ్గా 11 రోజుల తర్వాత సింధూ జలాల ఒప్పందంపై కమిషనర్లు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలోనే ప్రధాని మోదీ అధికారులతో మాట్లాడుతూ ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నెత్తుటి చర్యలకు పాల్పడుతున్న దాయాదితో నీటిపై ఒప్పందం కొనసాగించలేమని ప్రధాని ఆనాడు సూచనప్రాయంగా వెల్లడించారు. తాజాగా ఐడబ్ల్యూటీ ఒప్పంద సవరణకు భారత్.. పాక్‌కు నోటీసులిచ్చిన వేళ నాటి మోదీ వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి.

ఉరి (Uri) ఘటన జరిగిన రెండేళ్లకు 2018 మే నెలలో ప్రధాని మోదీ బాందిపొరాలో కిషన్‌గంగా ప్రాజెక్టును మోదీ ప్రారంభించారు. దీంతో పాటు జమ్మూకశ్మీర్‌లో 1000 మెగావాట్ల పాకల్‌-దుల్‌ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. అంతేగాక, ఉరి ఘటన తర్వాతే సింధూ నదీ జలాలపై ఉన్న మరో రెండు ప్రాజెక్టుల పనులు వేగవంతమయ్యాయి. భారత్‌పై ఉగ్రవాదాన్ని ప్రయోగించడంతో పాటు సింధూ జలాల ఒప్పందం విషయంలో పాక్‌ పాల్పడుతున్న ఉల్లంఘనలకు గట్టి సమాధానమిచ్చేందుకే మోదీ సర్కారు పలు ప్రాజెక్టులు చేపట్టింది. ఒప్పందం నిబంధనలకు లోబడి సింధూ జలాల గరిష్ఠ వినియోగించుకొనేందుకు చీనాబ్‌, జీలమ్‌ నదులపై మౌలిక వసతుల పనులను వేగవంతం చేసింది. వీటితో పాక్‌ ఆగడాలకు కళ్లెం వేయాలనేది కేంద్ర సర్కారు యోచన.

సింధూ జలాల ఒప్పందం (Indus water treaty) విషయంలో పాకిస్థాన్‌ మొండిగా వ్యవహరిస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతుండటంతో.. భారత్‌ తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పంద సవరణలకు నోటీసులిచ్చింది. దీనిపై 90 రోజుల్లోగా ఇరు దేశాల మధ్య చర్చలు జరగాల్సి ఉంటుంది. అయితే, ఈ నోటీసుపై పాక్‌ నుంచి ఇంతవరకూ స్పందన రాలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని