Kuwait fire accident: కువైట్‌ అగ్నిప్రమాదం.. భారత్‌కు చేరిన 45 మృతదేహాలు

కువైట్‌లోని అల్‌ మంగాఫ్‌లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 45 మంది భారతీయుల మృతదేహాలు శుక్రవారం ఉదయం భారత్‌కు చేరుకున్నాయి.

Updated : 15 Jun 2024 06:24 IST

కొచ్చిన్‌లో 31, దిల్లీలో 14 శవపేటికల అందజేత
సీఎం పినరయి, కేంద్ర సహాయ మంత్రి సురేశ్‌ గోపి నివాళులు

కొచ్చిన్‌ : కువైట్‌లోని అల్‌ మంగాఫ్‌లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 45 మంది భారతీయుల మృతదేహాలు శుక్రవారం ఉదయం భారత్‌కు చేరుకున్నాయి. భారత వాయుసేన (ఐఏఎఫ్‌)కు చెందిన ప్రత్యేక విమానం మృతదేహాలతో తొలుత కొచ్చిన్‌ విమానాశ్రయానికి చేరుకుంది. 

కొచ్చిన్‌ విమానాశ్రయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర పర్యాటకశాఖ సహాయమంత్రి సురేశ్‌ గోపి, రాష్ట్ర మంత్రులు కె.రాజన్, పి.రాజీవ్, వీణా జార్జ్‌ 31 మృతదేహాలను స్వీకరించారు. వాటిలో 23 కేరళవాసులవి కాగా ఏడు తమిళులవి, మరొకటి కర్ణాటకకు చెందినదని అధికారులు తెలిపారు. మిగిలిన 14 మృతదేహాలను అదే విమానంలో దిల్లీకి తరలించారు. కొచ్చిన్‌ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోడియం వద్ద మృతదేహాలకు సీఎం, కేంద్ర సహాయమంత్రి, మంత్రులు, అధికారులు నివాళులర్పించారు. పోలీసులు గౌరవవందనం సమర్పించారు. అనంతరం బాధితుల మృతదేహాలను వారివారి ఇళ్లకు అంబులెన్స్‌ల్లో అధికారులు తరలించారు. తమిళనాడు, కర్ణాటకకు మృతదేహాలను తీసుకెళ్లే అంబులెన్స్‌కు తోడుగా కేరళ పోలీసు పైలట్‌ వాహనాన్ని ఏర్పాటు చేశారు. 

కువైట్‌లో మరణించిన భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రప్రభుత్వం గురువారం రాత్రి సైనిక రవాణా విమానాన్ని పంపింది. అందులో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌ సింగ్‌ కువైట్‌ వెళ్లి మృతదేహాలతో దేశానికి తిరిగి వచ్చారు. 

నాకు అనుమతి ఇవ్వలేదు

అగ్నిప్రమాద సహాయక చర్యల సమన్వయం కోసం కువైట్‌ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం తనకు అనుమతి ఇవ్వలేదని కేరళ మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. అనుమతి నిరాకరణపై కేరళ సీఎం పినరయి విజయన్, ప్రతిపక్ష కాంగ్రెస్‌ విమర్శలు కురిపించాయి. దీనిపై రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ స్పందిస్తూ.. మృతదేహాలు దేశానికి వస్తుంటే రాష్ట్ర మంత్రి వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు. 

దిల్లీ చేరిన విమానం

కొచ్చిన్‌ విమానాశ్రయం నుంచి 14 మంది మృతదేహాలతో బయలుదేరిన విమానం శుక్రవారం దిల్లీ చేరుకుంది. విమానం నుంచి కిందకు దింపిన మృతదేహాలకు స్థానిక ఎంపీలు యోగేందర్‌ చందోలియా, కమల్జీత్‌ షెరావత్‌ శ్రద్ధాంజలి ఘటించారు. 

రూ.8 లక్షల చొప్పున పరిహారం

దుర్మరణం పాలైన భారత కార్మికుల కుటుంబాలకు రూ.8 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని కువైట్‌కు చెందిన ఎన్‌బీటీసీ సంస్థ ప్రకటించింది. గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున అందిస్తామంది. కేరళకు చెందిన కేజీ అబ్రహం ఎన్‌బీటీసీ సంస్థలో భాగస్వామిగాను, ఎండీగాను వ్యవహరి స్తున్నారు. బాధితులంతా ఈ సంస్థలో  కార్మికులుగా పనిచేస్తున్నారు.


మరో భారతీయుడి మృతి

కువైట్‌ అగ్నిప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మనదేశానికే చెందిన మరో వ్యక్తి మృతి చెందినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో మరణించిన భారతీయుల సంఖ్య 46కు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 50కి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు