Earthquake: తుర్కియే భూకంపం.. భారతీయుడి మృతదేహం లభ్యం!

తుర్కియేలోని భూకంప ప్రభావిత మాలత్య నగరంలో ఓ భారతీయుడి మృతదేహం లభ్యమైంది. తుర్కియేలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అతన్ని ఉత్తరాఖండ్‌కు చెందిన విజయ్‌కుమార్‌గా గుర్తించింది. 

Published : 11 Feb 2023 19:59 IST

అంకారా: తుర్కియే(Turkey), సిరియా(Syria)ల్లో భూకంపం(Earthquake) మిగిల్చిన విధ్వంసం అంతాఇంతా కాదు! రెండు దేశాల్లో కలిపి ఇప్పటికే దాదాపు 25 వేలకుపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు.. శిథిలాల కుప్పలనుంచి మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా తుర్కియేలోని మాలత్య(Malatya) నగరంలో భూకంప ప్రభావిత ప్రాంతంనుంచి ఓ భారతీయుడి మృతదేహాన్ని వెలికితీశారు. తుర్కియేలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

మృతుడిని ఉత్తరాఖండ్‌కు చెందిన విజయ్‌ కుమార్‌గా గుర్తించింది. ఆయనో వ్యాపారవేత్త అని, బిజినెస్‌ ట్రిప్‌ మీద మాలత్యకు వచ్చినట్లు తెలిపింది. భూకంప ఘటన నాటినుంచి ఆచూకీ లేకుండా పోయారని, తాజాగా ఇక్కడి ఓ హోటల్‌ శిథిలాల్లో ఆయన మృతదేహం బయటపడినట్లు వెల్లడించింది. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ.. భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదిలా ఉండగా. ఫిబ్రవరి 6న సంభవించిన భూకంపం తుర్కియే, సిరియాలను కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, ఇప్పటికే 5 రోజులు దాటడంతో శిథిలాల కింది చిక్కుకుపోయినవారిలో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారో తెలియని పరిస్థితి. అతిశీతల వాతావరణ పరిస్థితులు ఉండటంతో ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. మరోవైపు ఈ రెండు దేశాలకు భారత్‌ సహా ప్రపంచ దేశాలు తమ ఆపన్నహస్తం అందిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు