Jammu kashmir: అవును.. అది నా కొడుకు మృతదేహమే!

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో కుళ్లిపోయిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ మృతదేహాన్ని గతేడాది తప్పిపోయిన రైఫిల్‌మ్యాన్‌ షాకిర్‌ మంజూర్‌దని

Published : 22 Sep 2021 22:50 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో కుళ్లిపోయిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ మృతదేహాన్ని గతేడాది తప్పిపోయిన రైఫిల్‌మ్యాన్‌ షకిర్‌ మంజూర్‌దని అనుమానిస్తున్నారు. అయితే, ఫోరెన్సిక్‌ అధికారులు మృతదేహం నుంచి కొన్ని ఆధారాలను సేకరించారని డీఎన్‌ఏ పరీక్ష చేసిన తర్వాతే మృతదేహం ఎవరిదనేది నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు.

అసలేం జరిగిందంటే..?

భారత సైన్యంలోని టెరిటోరియల్ ఆర్మీ యూనిట్‌కు చెందిన 162 బెటాలియన్‌లో షకిర్‌ మంజూర్‌ రైఫిల్‌మ్యాన్‌గా పనిచేసేవారు. గతేడాది కుటుంబ సభ్యులతో పండుగ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ఉన్న రెషిపోరాలోని తన ఇంటికి షకిర్‌ వెళ్లారు. క్యాంపుకు తిరిగి వెళ్తుండగా మార్గమధ్యలో తప్పిపోయారు. అతని కోసం గాలిస్తున్న పోలీసులకు ఆ మరుసటి రోజే కుల్గాం జిల్లాలో షకీర్‌ వాహనం మంటల్లో పూర్తిగా కాలిపోయి కన్పించింది. అతడిని ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే అతడి ఆచూకీ మాత్రం తెలియరాలేదు.

మృతదేహం నా కుమారుడిదే..

మృతదేహం లభ్యమైన విషయంపై షకిర్‌ మంజూర్‌ వాళ్ల తండ్రి మంజూర్‌ అహ్మద్‌ స్పందించారు. ‘‘నేను షకిర్‌ కాళ్లు, వెంట్రుకలు, బ్రాస్‌లైట్‌ను చూసి గుర్తుపట్టాను. అది నా కుమారుడిదే’’అని పేర్కొన్నారు. ప్రభుత్వం అసలు వెతికే ప్రయత్నం కూడా చేయలేదని ఆరోపించారు. షకిర్‌ అదృశ్యమైన కొన్ని రోజుల తర్వాత రక్తపు మరకలతో ఉన్న చొక్కా లభ్యమైందని తెలిపారు. కానీ, అధికారిక రికార్డుల్లో షకిర్‌ చనిపోలేదని తప్పిపోయినట్లుగానే ఉందన్నారు. ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదన్నారు. అంతేకాకుండా షకిర్‌ ఉగ్రవాదులతో కలిసి పోయారా అని చాలా సార్లు ప్రశ్నించారన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని