భారత్‌కు బ్రెజిల్‌ అధ్యక్షుడి వినూత్న కృతజ్ఞత!

భారత్‌ పంపిన కొవిషీల్డ్‌ టీకాలు శనివారం బ్రెజిల్‌కు చేరుకున్నాయి. 20 లక్షల డోసులతో శుక్రవారం ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం బ్రెజిల్‌కు బయలుదేరిన విషయం తెలిసిందే.......

Published : 23 Jan 2021 12:59 IST

రియో డీ జెనిరో (బ్రెజిల్): భారత్‌ పంపిన కొవిషీల్డ్‌ టీకాలు శనివారం బ్రెజిల్‌కు చేరుకున్నాయి. 20 లక్షల డోసులతో శుక్రవారం ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం బ్రెజిల్‌కు బయలుదేరిన విషయం తెలిసిందే. భారత ఉదారతకు బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్‌ టీకాలను రాయాయణంలో హనుమంతుడు తెచ్చిన సంజీవనితో పోల్చారు. ఈ మేరకు టీకాలను హనుమంతుడు భారత్‌ నుంచి బ్రెజిల్‌కు మోసుకెళ్తున్నట్లు ఉన్న ఓ చిత్రాన్ని ట్విటర్‌లో ఉంచారు. ఆ చిత్రంపై ‘భారత్‌కు ధన్యవాదాలు’ అని హిందీ, ఇంగ్లిష్‌తో పాటు బ్రెజిల్‌ అధికారిక భాషలో రాశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీకి బోల్సోనారో కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ప్రధాని మోదీకి నమస్కారం. కరోనాపై బ్రెజిల్‌ చేస్తున్న పోరులో భారత్ వంటి దేశం భాగస్వామిగా చేరడం గౌరవంగా భావిస్తున్నాం. వ్యాక్సిన్‌లను పంపి మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని బోల్సోనారో ట్వీట్‌ చేశారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. ‘‘కరోనాను అంతమొందించడంలో బ్రెజిల్‌ వంటి భాగస్వామ్య దేశంతో కలిసి పనిచేయడం మేమూ గౌరవంగా భావిస్తున్నాం. వైద్యం, ఆరోగ్య సంరక్షణ విషయంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తాం’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

బ్రెజిల్‌తో పాటు మొరాకోకు కూడా భారత్‌ శుక్రవారం 20 లక్షల డోసుల్ని ప్రత్యేక విమానంలో పంపింది. బుధవారం నుంచి వివిధ దేశాలకు భారత్‌ కొవిడ్‌ టీకాలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఒప్పంద ప్రాతిపదికన సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, మొరాకో, బంగ్లాదేశ్‌, మయన్మార్‌కు కొవిడ్‌ టీకాల సరఫరా చేపడుతున్నట్లు శుక్రవారం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. మరోవైపు కొవిడ్‌ టీకాలను పంపించినందుకుగానూ బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా.. మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దక్షిణాసియాలోని పలు దేశాలకు కొవిడ్‌-19 టీకాలను అందించిన భారత ఔదార్యాన్ని అమెరికాలోని జో బైడెన్‌ సర్కార్‌ ప్రశంసించింది.

ఇవీ చదవండి..

టీకాపై రాజకీయాలను పట్టించుకోలేదు

రెండో వరుస నమోదు ఎప్పుడు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని