Nitish kumar: బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ సభలో పేలుడు కలకలం

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ సభలో భారీ శబ్దంతో పేలుడు సంభవించిన ఘటన కలకలం సృష్టించింది.

Updated : 12 Apr 2022 17:29 IST

నలంద: బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ హాజరైన ఓ సభలో భారీ శబ్దంతో పేలుడు సంభవించిన ఘటన కలకలం సృష్టించింది. నలందలో జరుగుతున్న జనసభకు సమీపంలో ఓ వ్యక్తి పేలుడు పదార్థాన్ని విసరడంతో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. భద్రతా సిబ్బంది సీఎంకు రక్షణగా నిలిచి అక్కడి నుంచి తరలించారు. భారీ పేలుడుతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. చివరకు అది బాణసంచా పేలుడుగా గుర్తించడంతో పోలీసులు, అధికారులు, సభకు వచ్చిన ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలాఉంటే, సీఎం నితీశ్‌ కుమార్‌పై ఇటీవలే ఓ వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. పట్నాకు సమీపంలోని సీఎం స్వస్థలం బఖ్తియార్‌పుర్‌లోని స్థానిక ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆ ఘటన చోటుచేసుకుంది. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న సమయంలోనే వెనుక నుంచి వేగంగా వేదికపైకి ఎక్కిన ఓ యువకుడు సీఎం నితీశ్‌ వీపుపై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ముఖ్యమంత్రికి అత్యంత సమీపంలో పేలుడు ఘటన కలకలం సృష్టించింది. అయితే, సీఎం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి లక్ష్యంగా ఇటువంటి దాడులు జరుగుతుండడం భద్రతా వైఫల్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని