Bomb found: సీఎం భగవంత్‌ మాన్‌ ఇంటి వద్ద బాంబు స్వాధీనం

పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఇంటి వద్ద బాంబు కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అక్కడికి చేరుకొని బాంబును స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated : 02 Jan 2023 19:05 IST

చండీగఢ్‌: ఆప్‌ సీనియర్‌ నేత, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌(Bhagwant Mann) నివాసం వద్ద బాంబు(Bomb) కలకలం రేపుతోంది. చండీగఢ్‌లోని సీఎం ఇంటికి సమీపంలో అనుమానాస్పద పేలుడు పదార్థాన్ని గుర్తించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇది పంజాబ్(Punjab) సీఎం ఇంటికి సమీపంలోని హెలీప్యాడ్‌కు కొద్ది దూరంలోనే ఉండటంతో తీవ్ర కలకలం రేపింది. దీంతో తక్షణమే బాంబు నిర్వీర్య స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. ఈ సాయంత్రం 4 నుంచి 4.30గంటల సమయంలో పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఇంటికి దాదాపు కి.మీ దూరంలోని ఓ మామిడి తోటలో ట్యూబ్‌వెల్‌ ఆపరేటర్‌ ఈ బాంబును గుర్తించగా.. ఆ సమయంలో భగవంత్‌ మాన్‌ ఇంట్లో లేరు. ఈ ఘటనపై రక్షణ బలగాలు దర్యాప్తు చేస్తాయని చండీగఢ్‌ అధికారులు వెల్లడించారు. బాంబు ఎక్కడి నుంచి వచ్చింది.. ఎలా వచ్చిందో దర్యాప్తు చేస్తారని పేర్కొన్నారు.

‘‘ఇక్కడ అవాంఛనీయ పదార్థం ఉన్నట్టు మాకు సమాచారం అందింది. అక్కడికి చేరుకొని పరిశీలించగా.. బాంబుగా గుర్తించాం. దాన్ని సీజ్‌ చేసి దర్యాప్తు చేస్తున్నాం. అసలు అది ఇక్కడకు ఎలా వచ్చింది తదతర వివరాలను తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాం. మరోవైపు, బాంబు స్క్వాడ్‌తో ఆ ప్రాంతాన్ని తనిఖీ చేస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడికి ఆర్మీ సిబ్బంది చేరుకొని పర్యవేక్షిస్తున్నారు’’ అని చండీగఢ్‌ అడ్మినిస్ట్రేషన్ నోడల్‌ ఆఫీసర్‌ కుల్దీప్‌ కోహ్లీ మీడియాకు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని