బాంబే హైకోర్టు: 12 గంటలు.. 80 కేసుల విచారణ

బాంబే హైకోర్టులో పెండింగ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి డివిజన్‌ బెంచ్‌ మారథాన్‌ విచారణ చేపట్టింది. ఎలాంటి విరామం లేకుండా ఏకధాటిగా 12 గంటల పైనే  కూర్చుని

Published : 20 May 2021 22:42 IST

ముంబయి: బాంబే హైకోర్టులో పెండింగ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి డివిజన్‌ బెంచ్‌ మారథాన్‌ విచారణ చేపట్టింది. ఎలాంటి విరామం లేకుండా ఏకధాటిగా 12 గంటల పైనే  కూర్చుని 80 కేసులను విచారించింది.

జస్టిస్‌ ఎస్‌జే కతవల్లా, జస్టిస్‌ ఎస్పీ తవాడేలతో కూడిన డివిజన్ ధర్మాసనం బుధవారం ఉదయం 10.45 గంటలకు ఈ సుదీర్ఘ విచారణ ప్రారంభించింది. ఎల్గర్‌ పరిషద్‌ కేసు నిందితులు స్టాన్‌ స్వామీ, హనీ బాబు పిటిషన్లు, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై సీబీఐ దర్యాప్తునకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ సహా మొత్తం 80 కేసుల వాదనలను ఈ ధర్మాసనం విచారించింది. ఇందుకోసం న్యాయమూర్తులు ఇద్దరూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మొత్తం 12.30 గంటల పాటు బెంచ్‌పై కూర్చున్నారు. మధ్యలో ఎలాంటి విరామం తీసుకోలేదు. భోజనం, స్నాక్స్‌ కూడా వాదనలు వింటూనే పూర్తిచేశారు. 

జస్టిస్‌ కతవల్లా ఇలా సుదీర్ఘ విచారణలు చేపట్టడం ఇదే తొలిసారి కాదు. మూడేళ్ల క్రితం పెండింగ్‌ కేసుల విచారణ పూర్తి చేసేందుకు మరుసటి రోజు తెల్లవారుజామున 3.30 గంటల వరకు కోర్టులోనే ఉన్నారు. ఏకధాటిగా 16 గంటల పాటు విచారణలు జరిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని