వివాదాస్పద తీర్పులు.. హోదాకు ఎసరు!

చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు వెలువరించిన బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ పుష్ప గనేడివాలాకు షాక్‌ తగిలింది. ఆమెకు శాశ్వత న్యాయమూర్తి హోదాపై సుప్రీంకోర్టు

Published : 13 Feb 2021 13:50 IST

బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తికి దక్కని శాశ్వత హోదా 

దిల్లీ: చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు వెలువరించిన బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ పుష్ప గనేడివాలాకు షాక్‌ తగిలింది. ఆమెకు శాశ్వత న్యాయమూర్తి హోదాపై సుప్రీంకోర్టు కొలీజియం వెనక్కితగ్గడంతో అదనపు న్యాయమూర్తిగా జస్టిస్‌ పుష్ప పదవీకాలాన్ని మరో ఏడాది పొడగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

జస్టిస్‌ పుష్ప గనేడివాలా బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ఉన్నారు. నాగ్‌పూర్‌ బెంచ్‌కు ఆమెను శాశ్వత న్యాయమూర్తిగా ధ్రువీకరించేందుకు జనవరి 20న సుప్రీంకోర్టు కొలీజియం తొలుత ప్రతిపాదనలు చేసింది. అయితే ఇటీవల మైనర్లపై లైంగిక వేధింపుల కేసుల్లో జస్టిస్‌ పుష్ప కొన్ని సంచలన తీర్పులు వెల్లడించారు. అవి కాస్తా వివాదాస్పదం కావడంతో కొలీజియం తమ ప్రతిపాదనలను వెనక్కి తీసుకుంది. ఆమెను మరో రెండేళ్ల పాటు అదనపు న్యాయమూర్తి హోదాలోనే కొనసాగించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. 

శాశ్వత హోదా ఇవ్వకుండా కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం అంగీకరించింది. అయితే అదనపు న్యాయమూర్తిగా కొత్త పదవీకాలాన్ని రెండేళ్లు కాకుండా ఏడాదికి కుదించింది. ఫిబ్రవరి 13, 2021 నుంచి మరో ఏడాది పాటు జస్టిస్‌ పుష్ప అదనపు న్యాయమూర్తి పదవిలోనే కొనసాగుతారని న్యాయశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. పదవీకాలం గడువుపై కొలీజియంను సంప్రదించకుండానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.  

ఈ ఏడాది జనవరిలో జస్టిస్‌ పుష్ప రెండు సంచలన తీర్పులు వెలువరించిన విషయం తెలిసిందే. 12 ఏళ్ల బాలిక ఛాతీ భాగాన్ని ఓ వ్యక్తి తడమగా, చర్మం తగలనందున దీనిని లైంగిక వేధింపుల కింద పరిగణించలేమని జనవరి 19న జస్టిస్‌ పుష్ప నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. దుస్తుల మీద నుంచి శరీరభాగాలను తాకడం వేధింపులుగా పేర్కొనలేమని, లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఆ తర్వాత అయిదేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులోనూ జస్టిస్‌ పుష్ప ఇలాంటి తీర్పునే ఇచ్చారు. మైనర్‌ బాలికల చేతులు పట్టుకోవడం, వారి ముందు పురుషుడు ప్యాంటు జిప్‌ విప్పుకోవడం లైంగిక వేధింపుల కిందికి రాదని తీర్పు వెలువరించారు. వేధింపుల నుంచి బాలికలను రక్షించే పోక్సో చట్టం కింద వీటిని నేరంగా పరిగణించలేమని పేర్కొంటూ నిందితులకు కింది కోర్టు విధించిన శిక్షలను రద్దు చేశారు. అయితే ఈ తీర్పులు తీవ్ర దుమారం రేపాయి.

ఇవీ చదవండి..

నేరుగా తాకితేనే వేధింపులన్న హైకోర్టు తీర్పుపై స్టే

మైనర్‌ బాలిక ముందు ప్యాంట్ జిప్‌ తీయడం లైంగిక వేధింపు కాదు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని