Divorce: భార్యకు హెచ్‌ఐవీ అంటూ విడాకులకు దరఖాస్తు.. బాంబే హైకోర్టు ఏమన్నదంటే!

భార్యకు ప్రాణాంతక వ్యాధి ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తూ.. విడాకులకు యత్నించిన ఓ వ్యక్తి పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టిపారేసింది. ఆమెకు హెచ్‌ఐవీ సోకినట్లు నిర్ధరించే ఎటువంటి సాక్ష్యాధారాలను సమర్పించలేదని పేర్కొంటూ.. అతని అభ్యర్థనను తిరస్కరించింది.

Published : 24 Nov 2022 19:06 IST

ముంబయి: భార్యకు ప్రాణాంతక వ్యాధి ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తూ.. విడాకుల(Divorce)కు యత్నించిన ఓ వ్యక్తి పిటిషన్‌ను బాంబే హైకోర్టు(Bombay High Court) కొట్టిపారేసింది. ఆమెకు హెచ్‌ఐవీ సోకినట్లు నిర్ధరించే ఎటువంటి సాక్ష్యాధారాలను సమర్పించలేదని పేర్కొంటూ.. అతని అభ్యర్థనను తిరస్కరించింది. పుణెకు చెందిన దంపతులకు 2003లో వివాహమైంది. ఈ క్రమంలోనే.. ‘నా భార్యకు ప్రాణాంతక వైరస్‌ సోకింది. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నా. ఇకపై భార్యాభర్తలుగా కలిసి జీవించలేం. ఈ నేపథ్యంలో విడాకులు ఇప్పించండి’ అంటూ భర్త(44) 2011లో పుణెలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.

‘నా భార్య విచిత్రంగా ప్రవర్తిస్తోంది. ఆమె సంకుచిత మనస్తత్వం, మొండి స్వభావం గల వ్యక్తి. నాతో, నా కుటుంబ సభ్యులతో సరిగా వ్యవహరించడం లేదు. ఇప్పటికే అనేక వ్యాధులతో బాధపడింది. 2005లో ఆమెకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలింది’ అని విడాకుల పిటిషన్‌లో పేర్కొన్నాడు. అయితే, ఆమె మాత్రం ఈ వాదనలను ఖండించింది. సంబంధిత వైద్య పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చినప్పటికీ.. భర్త, అతని కుటుంబ సభ్యులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయింది. ఈ క్రమంలోనే.. పుణె ఫ్యామిలీ కోర్టు అతని పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ.. అతను అదే ఏడాది బాంబే హైకోర్టులో అప్పీల్‌ చేశాడు.

తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ నితిన్‌ జమ్‌దార్‌, జస్టిస్‌ శర్మిలా దేశ్‌ముఖ్‌లతో కూడిన ధర్మాసనం.. ప్రతివాదికి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలినట్లు వైద్య నివేదికను సమర్పించడంలో పిటిషన్‌దారు విఫలమయ్యాడని పేర్కొంది. ‘తనతో క్రూరంగా ప్రవర్తించినట్లు భార్యపై చేసిన ఆరోపణలపైనా ఆధారాలు అందించలేదు. ఆ వ్యాధి లేదని వైద్య నివేదికల్లో తేలినప్పటికీ.. ఆమెతో కలిసి ఉండేందుకు నిరాకరించాడు. పైగా.. తప్పుడు ప్రచారం చేస్తూ ఆమె పరువు తీశాడు. ఈ నేపథ్యంలో.. భార్యాభర్తలుగా కలిసి జీవించలేమనే వాదనపై దాఖలు చేసిన ఈ విడాకుల పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు తన ఉత్తర్వుల్లో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని