PayCM: ‘పేసీఎం’పై స్పందించిన కర్ణాటక సీఎం.. కాంగ్రెస్‌పై విమర్శలు

కర్ణాటకలో దుమారం రేపుతున్న ‘పేసీఎం’ పోస్టర్ల వ్యవహారంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసరాజ్‌ బొమ్మై స్పందించారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు కాంగ్రెస్‌ పార్టీనే ఈ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తోందని ఆరోపించారు.

Published : 25 Sep 2022 01:26 IST

బెంగళూరు: కర్ణాటకలో దుమారం రేపుతున్న ‘పేసీఎం’ పోస్టర్ల వ్యవహారంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసరాజ్‌ బొమ్మై స్పందించారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు కాంగ్రెస్‌ పార్టీనే ఈ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తోందని ఆరోపించారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం ద్వారా అధికారంలోకి వస్తామని ఆ పార్టీ కలలుగంటోందని విమర్శించారు. ఇలాంటి వాటిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని చెప్పారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు.

కాంగ్రెస్‌ పార్టీ నేతలకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా వచ్చి తనతో చెప్పాలని బసవరాజ్‌ బొమ్మై అన్నారు. ఆధారాలుంటే సమర్పించి విచారణకు డిమాండ్‌ చేయాలని సూచించారు. కానీ ఆ పార్టీ నేతలు ఎలాంటి ఆధారాలూ లేకుండా విమర్శలు చేస్తున్నారని బొమ్మై అన్నారు. కాంగ్రెస్‌ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కర్ణాటకలో తిరిగి భాజపానే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. తన 35 ఏళ్ల రాజకీయ అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని పేర్కొన్నారు. హైకమాండ్‌ అనుమతి వచ్చాక కేబినెట్‌ విస్తరణ ఉంటుందని చెప్పారు.

లింగాయత్‌ కాబట్టే సీఎంపై విమర్శలు

‘పేసీఎం’ వ్యవహారంపై ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ కె సుధాకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సీఎం అవ్వడం తట్టుకోలేకే కాంగ్రెస్‌ పార్టీ పేసీఎం ప్రచారానికి తెరతీసిందన్నారు. ఎవరు సుపరిపాలన అందించినా, లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సీఎంగా ఉంటే వారిని కాంగ్రెస్‌ సహించలేదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనంలోకి తీసుకోవాలన్నారు. గడిచిన 14 నెలలుగా బొమ్మై నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సర్కార్‌ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తుండడం చూసి కాంగ్రెస్‌ ఓర్వలేకపోతోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని