DNA Test: ఆ శరీర భాగాలు శ్రద్ధా వాకర్‌వే..! డీఎన్‌ఏ నివేదికలో వెల్లడి

శ్రద్ధా వాకర్‌ (Shraddha Walkar) హత్య కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల నుంచి స్వాధీనం చేసుకున్న శరీర భాగాలు ఆమెవేనని నిర్ధారణ అయ్యింది. శ్రద్ధా తండ్రి నుంచి సేకరించిన నమూనాలతో అవి సరిపోలినట్లు సమాచారం.

Published : 15 Dec 2022 14:49 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ (Shraddha Walkar) హత్య కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. దేశ రాజధానిలోని మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న శరీర భాగాలు శ్రద్ధా వాకర్‌వేనని నిర్ధారణ అయ్యింది.  ఆమె తండ్రి నుంచి సేకరించిన డీఎన్‌ఏ నమూనాతో (DNA Test) అవి సరిపోలినట్లు తాజా నివేదికలో వెల్లడైంది.

‘వివిధ ప్రాంతాల్లో లభించిన ఎముకల డీఎన్‌ఏ నివేదిక (DNA Report) పోలీసులకు చేరింది. అవి శ్రద్ధా వాకర్‌ తండ్రి నమూనాతో సరిపోలాయి’ అని అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో వాస్తవాలను ధ్రువీకరించుకునేందుకు దిల్లీ పోలీసులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆఫ్తాబ్‌కు పాలిగ్రాఫ్‌తో పాటు నార్కో పరీక్షలు కూడా పూర్తి చేశారు.  ఆమె శరీర భాగాలను 35 భాగాలుగా చేసి పడవేసినట్లు అనుమానిస్తుండగా.. వాటిలో ఇప్పటివరకు 13 భాగాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు మిగతా వాటికోసం గాలిస్తూనే ఉన్నారు.

మరోవైపు తన కుమార్తెను అతి దారుణంగా హత్య చేసిన ఆఫ్తాబ్‌ పూనావాలా (Aaftab Poonawala)ను ఉరితీయాలని శ్రద్ధా వాకర్ (Shraddha Walkar) తండ్రి వికాస్‌ డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన మీడియా ముందుకు వచ్చిన ఆయన.. మహారాష్ట్ర పోలీసులు సమయానికి స్పందించి ఉంటే తన కుమార్తె బతికేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు దిల్లీ పోలీసుల దర్యాప్తు సరైన దిశగానే సాగుతోందన్న ఆయన.. ఆఫ్తాబ్‌ను ఉరితీయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని