Amruta Fadnavis: 750 కిలోమీటర్ల ఛేజింగ్‌.. ఆపై క్రికెట్‌ బుకీ అరెస్టు

అమృతా ఫడణవీస్‌ను బెదిరించిన కేసులో నిందితుడైన అనిల్‌ జైసింఘానీని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఇందుకోసం 750 కిలోమీటర్ల ఛేజింగ్‌ జరిగింది. 

Published : 21 Mar 2023 13:25 IST

ఇంటర్నెట్‌డెస్క్: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృత(Amruta Fadnavis)ను డబ్బు కోసం బ్లాక్‌మెయిల్‌ చేసిన కేసులో కీలక నిందితుడు అనిల్‌ జైసింఘానీను పోలీసులు అరెస్టు చేశారు. సినీఫక్కీలో జైసింఘానీ ఫోన్లను మార్చేస్తూ రెండు సార్లు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొన్నాడు. చివరికి అతడిని వడోదర సమీపంలోని కోలాల్‌ వద్ద ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఇందుకోసం పోలీసులు 72 గంటలపాటు ‘ఆపరేషన్‌ ఏజే’ పేరిట గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 750 కిలోమీటర్లు అతడిని వెంటాడారు. జైసింఘానీను మలబార్‌హిల్స్‌ పోలీసులకు అప్పగించారు. అతడిని నేడు న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టనున్నారు.

‘‘ఆపరేషన్‌ ఏజే చేపట్టి జైసింఘానీను గుజరాత్‌లో అదుపులోకి తీసుకొన్నాం. అతడు రెండుసార్లు పోలీసులకు మస్కాకొట్టి తప్పించుకొన్నాడు. అతడు చాలా ఎలక్ట్రానిక్‌ పరికరాలను మార్చాడు’’ అని సైబర్‌పోలీస్‌ డీసీసీ బాలాసింగ్‌ రాజ్‌పుత్‌ పేర్కొన్నాడు. మహారాష్ట్రలోనే అతిపెద్ద క్రికెట్‌ బుకీలలో ఒకడైన జైసింఘానీపై దాదాపు 15 కేసులు ఉన్నాయి.  అనిల్‌ మొబైల్‌ లొకేషన్‌ను తొలిసారి గుజరాత్‌లో శుక్రవారం గుర్తించారు. ఆ తర్వాతి రోజు అది సూరత్‌కు మారిపోయింది. పోలీసులు అక్కడకు చేరుకొనే సరికి.. అనిల్‌ ఎయిర్‌పోర్టు వద్దకు వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు అతడిని వెంటాడి చివరికి కొలాల్‌ సమీపంలో అదుపులోకి తీసుకొన్నారు. అనిల్‌ సిమ్‌కార్డుల నుంచి ఫోన్లు అసలు చేయడని పోలీసులు తెలిపారు. అతడు ఇంటర్నెట్‌ ఆధారిత వీవోఐపీ కాల్స్‌ మాత్రమే చేస్తాడన్నారు. అతడు వేర్వేరు పేర్లతో డాంగిల్స్‌ను కొనుగోలు చేసేవాడు. వాటిని ప్రతి ఐదారు రోజులకు మార్చేసేవాడని పోలీసులు వెల్లడించారు. అతడి నుంచి రెండు డాంగిల్స్‌, రెండు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు. 

అనిల్‌ జైసింఘానీ కుమార్తె అనిక్ష ఏకంగా మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్‌ సతీమణి అమృతాను బెదిరించింది. తొలుత రూ.కోటి ఇస్తాను.. తన తండ్రి అనిల్‌ను కేసుల నుంచి బయటపడేయమని కోరింది. దానికి అమృతా నిరాకరించడంతో కొన్ని మార్ఫింగ్‌  వీడియోలను తయారు చేసి వాటిని లీక్‌ చేస్తానని అమృతాను బెదిరించింది. తనకు రూ. 10 కోట్లు చెల్లించాలని డిమాండ్‌  చేసింది. దీనిపై అమృతా ఫడణవీస్‌ (Amruta Fadnavis) బ్లాక్‌మెయిల్‌ (Blackmail), బెదిరింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే.  అనిక్షను గురువారమే పోలీసులు అరెస్టు చేశారు. 

అనిల్‌ జైసింఘానీ పేరు మోసిన అంతర్జాతీయ క్రికెట్‌ బుకీ అని తెలుస్తోంది. ఐపీఎల్‌ సమయంలో కోట్లాది రూపాయాలతో బెట్టింగ్‌లు నిర్వహించే అనిల్‌.. ఆ కేసుల్లో చిక్కకుండా ఉండేందుకు పోలీసులకు భారీగా లంచాలు ఇస్తుంటాడట. ఆ తర్వాత వాటిని వీడియోలు తీసి పోలీసులను బ్లాక్‌మెయిల్‌ చేస్తుంటాడని తెలిసింది. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ NCP) తరఫున అనిల్‌ గతంలో కార్పొరేటర్‌గా పనిచేశాడు. అతడి వద్ద ఖరీదైన పెంపుడు శునకాలు ఉన్నాయి. కేసు విచారణ నిమిత్తం పోలీసులు అతడి ఇంటికి వెళ్తే.. వారిపైకి శునకాలను వదిలి భయపెట్టేవాడని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు