Bengaluru: చివరి నిమిషంలో ట్రెవర్‌ షో రద్దు.. క్షమాపణలు కోరిన బుక్‌ మై షో

ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌, ఎమ్మీ విజేత ట్రెవర్‌ నోహ్‌ షో రద్దుపై బుక్‌ మై షో బెంగళూరు ప్రజలను క్షమాపణలు కోరింది. దీంతో పాటు టికెట్‌ కొనుగోలుదారులకు డబ్బు తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది.

Published : 28 Sep 2023 13:08 IST

బెంగళూరు: ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌ ట్రెవర్‌ నోహ్‌ (Trevor Noah) షోను వీక్షించేందుకు వచ్చిన ప్రేక్షకులకు చివరి నిమిషంలో నిరాశ మిగిలింది. బుధవారం బెంగళూరు (Bengaluru) వేదికగా రెండు రోజుల పాటు జరగాల్సిన నోహ్‌ కామెడీ షో సాంకేతిక లోపాల కారణంగా మధ్యలో ఆగిపోయింది. దీంతో షోను నిర్వహించిన బుక్‌ మై షో (BookMyShow), ట్రెవర్‌ నోహ్‌ ట్విటర్‌ వేదికగా బెంగళూరు ప్రేక్షకులను క్షమాపణలు కోరారు.

అంతేకాకుండా టికెట్‌ కొనుగోలు చేసిన వారికి ఆ డబ్బును తిరిగి చెల్లిస్తామంటూ బుక్‌ మై షో ప్రకటించింది. దక్షిణాఫ్రికాకు చెందిన ట్రెవర్‌ నోహ్‌ ‘ఆఫ్‌ ది రికార్టు’ టూర్‌లో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్నారు. సెప్టెంబరు 23, 24 తేదీల్లో దిల్లీలో ప్రదర్శన ఇచ్చారు. అనంతరం బెంగళూరు చేరుకున్న ట్రెవర్‌ మరో ప్రదర్శనకు సిద్దమయ్యారు. దీంతో అతడి కామెడీని చూసేందుకు ట్రాఫిక్‌ను దాటుకొని మరీ ఎంతో మంది కార్యక్రమానికి తరలి వచ్చారు. కానీ, చివరి నిమిషంలో షోను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ చర్యపై కొందరు ప్రేక్షకులు మండిపడుతున్నారు.

మణిపుర్‌లో మళ్లీ కల్లోలం.. పుల్వామా దర్యాప్తు ఐపీఎస్‌ అధికారికి పిలుపు..

‘‘ఈ నెల 27, 28 తేదీల్లో జరగాల్సిన ట్రెవర్‌ నోహ్‌ కామెడీ షో కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అందుకు బెంగళూరు ప్రజలను క్షమాపణలు కోరుతున్నాం. టికెట్‌ కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికీ పది రోజుల్లో డబ్బును తిరిగి చెల్లిస్తాం. ప్రేక్షకులను నిరాశ పరిచినందుకు ఎంతో చింతిస్తున్నాం. ట్రెవర్‌ను తిరిగి నగరానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తాం’’ అని బుక్‌ మై షో ట్వీట్‌ చేసింది. ‘‘బెంగళూరు కార్యక్రమం నిర్వహించేందుకు ఎంతో ఎదురుచూశాను. కానీ, చివరి నిమిషంలో రెండు షోలు రద్దయ్యాయి. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. తిరిగి షో ప్రారంభించేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. అందుకు మీరంతా నన్ను క్షమించండి’’ అని ట్రెవర్‌ క్షమాపణలు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని