US: భారతీయ మహిళ బలవన్మరణం.. స్పందించిన న్యూయార్క్‌ కాన్సులేట్‌ జనరల్‌

కుమార్తెలకు జన్మనిస్తున్నావంటూ అత్తింటివారి వేధింపులు భరించలేని ప్రవాస భారతీయురాలు మన్‌దీప్‌ కౌర్‌ తనువు చాలించిన విషయం తెలిసిందే........

Published : 08 Aug 2022 02:14 IST

న్యూయార్క్‌: కుమార్తెలకు జన్మనిస్తున్నావంటూ అత్తింటివారి వేధింపులు భరించలేని ప్రవాస భారతీయురాలు మన్‌దీప్‌ కౌర్‌ తనువు చాలించిన విషయం తెలిసిందే. ఈ వేధింపులు తాళలేనంటూ, తండ్రిని క్షమించాలని కోరుతూ ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, మృతురాలి భర్త వద్ద ఉన్న ఇద్దరు కుమార్తెల గురించి ఉత్తర్‌ప్రదేశ్‌లోని బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. దుర్మార్గుడైన అతడి నుంచి బాలికలను విడిపించి ఇక్కడకు పంపించాలని అధికారులను వేడుకుంటున్నారు. తమ కుమార్తె ఆత్మహత్యకు కారకులైన బాధితులను శిక్షించాలని కోరుతున్నారు.

మృతురాలి తండ్రి జస్పాల్‌ సింగ్‌ స్థానిక పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. దీన్ని పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా ఈ ఘటనపై న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌ జనరల్‌ స్పందించింది. ఈ విషయంపై అమెరికా అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపింది. ‘అత్యంత దయనీయ పరిస్థితుల్లో మన్‌దీప్‌ కౌర్‌ మరణం తీవ్ర బాధకు గురిచేసింది. ఈ ఘటనపై అమెరికా అధికారులతో, అక్కడి స్థానికులతో చర్చలు సాగిస్తున్నాం. అన్ని రకాల సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాం’ అంటూ కాన్సులేట్‌ జనరల్‌ ట్వీట్‌ చేసింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన మన్‌దీప్‌ కౌర్‌ (30)కు రన్‌జోద్‌బీర్‌ సింగ్‌ సంధుకు 2015లో వివాహం జరిగింది. అనంతరం వారు న్యూయార్క్‌కు వలసవెళ్లారు. అయితే వారికి ఇద్దరు కుమార్తెలు సంతానంగా కలగడంతో.. అప్పటినుంచి కౌర్‌కు వేధింపులు మొదలయ్యాయి. ‘ప్రతిరోజు ఈ దాడులను భరించలేను. ఎనిమిదేళ్లుగా క్షోభకు గురవుతున్నా.. ఇత బ్రతకలేను’ అంటూ విలపిస్తూ ఓ వీడియోను ట్విటర్‌ పంచుకుంది. అనంతరం ఆత్మహత్యకు పాల్పడింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని