Narendra Modi: బోరిస్ జాన్సన్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ.. భారత్‌ టీకా ధ్రువీకరణ పత్రాల గుర్తింపుపై స్వాగతం!

వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి తదితర సమస్యలపై పరస్పర సమన్వయంతో పోరాడాలని భారత్‌, యూకే నిర్ణయించాయి. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో సంభాషించారు. ఈ విషయాన్ని మోదీ ట్విటర్‌ వేదికగా...

Published : 11 Oct 2021 17:46 IST

దిల్లీ: వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి తదితర సమస్యలపై పరస్పర సమన్వయంతో పోరాడాలని భారత్‌, యూకే నిర్ణయించాయి. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో సంభాషించారు. ఈ విషయాన్ని మోదీ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘బోరిస్ జాన్సన్‌తో మాట్లాడటం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా భారత్‌- యూకే ఎజెండా 2030 పురోగతిని సమీక్షించాం. దీంతోపాటు గ్లాస్గోలో సీఓపీ-26 సమావేశం నేపథ్యంలో వాతావరణ మార్పుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలను పంచుకున్నాం. అఫ్గాన్‌ సహా ఇతర ప్రాంతీయ సమస్యలపై చర్చించాం’ అని పేర్కొన్నారు. క్వారంటైన్‌ నిబంధనలు, వ్యాక్సిన్‌ ధ్రువపత్రాల గుర్తింపు విషయంలో ఇటీవల బ్రిటన్‌, భారత్‌ మధ్య వివాదం చెలరేగడం, చివరకు బ్రిటన్‌ దిగిరావడం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య ఇరు దేశాల ప్రధానులు మాట్లాడుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. భారత్‌ టీకా ధ్రువీకరణ పత్రాలను బ్రిటన్‌ గుర్తించడం స్వాగతించదగిన పరిణామమని ఇద్దరు నేతలూ అంగీకరించినట్లు సమాచారం.

నేటినుంచే మినహాయింపు.. 

కొవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. తమ దేశానికి వచ్చే భారతీయులు 10 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనంటూ బ్రిటన్‌ ఇటీవల నిబంధనలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రతిగా భారత్‌ కూడా ఇక్కడికొచ్చే బ్రిటన్‌ పౌరులకూ క్వారంటైన్‌ను తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో బ్రిటన్‌ వెనక్కి తగ్గి.. కొవిషీల్డ్‌ రెండు డోసులు వేసుకొని వచ్చే భారతీయులకు క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. నేటినుంచే ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని భారత్‌లో బ్రిటిష్‌ హైకమిషనర్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని