BrahMos Missile: బ్రహ్మోస్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం

బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్ క్షిపణిని భారతనావికా దళం విజయవంతంగా చేపట్టింది. అరేబియాసముద్రంలోని ఓ నౌక నుంచి ఈ ప్రయోగం చేసింది.

Published : 06 Mar 2023 00:20 IST

దిల్లీ: అరేబియా సముద్రంలో బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్షిపణిని భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించింది.  ఇందులో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘సీకర్‌ అండ్‌ బూస్టర్‌’లను ఉపయోగించినట్లు నేవీ ఉన్నతాధికారులు తెలిపారు.‘‘ స్వదేశీ పరిజ్ఞానంతో ఓడ నుంచి ప్రయోగించగలిగే సత్తా ఉన్న బ్రహ్మోస్‌ క్షిపణిని భారత నావికా దళం పరీక్షించింది. ఇందులోని సీకర్‌ బూస్టర్‌లను డీఆర్‌డీవో తయారు చేసింది. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్‌ భారత్‌ పట్ల మా నిబద్ధతను ఇది బలపరుస్తోంది’’ ఇండియన్‌ నేవీ అధికారిక ట్విటర్‌లో పేర్కొంది.

భారత్‌-రష్యాలు సంయుక్తంగా ఈ బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణులను తయారు చేస్తున్నాయి. వీటిని జలాంతర్గాములు, నౌకలు, విమానాల నుంచి కూడా ప్రయోగించేందుకు వీలుగా రూపొందిస్తున్నారు. ఈ బ్రహ్మోస్‌ క్షిపణి ధ్వని వేగానికి మూడురెట్ల వేగంతో ప్రయాణించగలిగే సామర్థ్యం కలిగి ఉంది.  గతేడాది ఏప్రిల్‌లో భారత్‌ నేవీ, అండమాన్‌ నికోబార్‌ కమాండ్‌తో కలిసి యాంటి షిప్‌ వెర్షన్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిస్‌ క్షిపణలను పరీక్షించింది. మరోవైపు భారత్‌ ఈ బ్రహ్మోస్‌ మిస్సైళ్లను ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తోంది. ఈ క్షిపణుల మూడు బ్యాటరీలను సరఫరా చేసేందుకు గతేడాది జనవరిలో ఫిలిప్పీన్స్‌తో 375 మిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని