కొవాగ్జిన్ వైపు ప్రపంచ దేశాల చూపు..!
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ డోసుల కోసం బ్రెజిల్ సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రకటించింది.
సంప్రదింపులు జరుపుతోన్న బ్రెజిల్
ఇంటర్నెట్ డెస్క్: యావత్ ప్రపంచం ఎదురుచూస్తోన్న కరోనా వ్యాక్సిన్ ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే అత్యవసర వినియోగం కింద దాదాపు 30దేశాల్లో పలు కంపెనీలకు చెందిన టీకాలు అనుమతులు పొందాయి. ఇక భారత్‌లోనూ అత్యవసర వినియోగం కింద రెండు వ్యాక్సిన్లు అనుమతి పొందాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల తయారీ, అభివృద్ధి కేంద్రంగా ఉన్న భారత్‌వైపు ప్రపంచదేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. దీనిలో భాగంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ డోసుల కోసం బ్రెజిల్ సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రకటించింది. ప్రయోగదశలో ఉన్న ఈ టీకా వివరాలను తెలుసుకునేందుకు వివిధ దేశాల దౌత్యవేత్తలు హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీని ఇటీవలే సందర్శించిన విషయం తెలిసిందే.
భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ టీకా మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలోనే అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి లభించింది. దీంతో బ్రెజిల్‌కు చెందిన ప్రైవేటు సంస్థ బ్రెజిలియన్ అసోసియేషన్ ఆఫ్ వ్యాక్సిన్ క్లినిక్స్(ఏబీసీవీఏసీ) కొవాగ్జిన్ డోసుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం భారత కంపెనీతో ఇప్పటికే ఎంవోయూ కుదుర్చుకున్నట్లు ధ్రువీకరించింది. ‘ప్రైవేటు మార్కెట్లో వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందులో భాగంగా భారత్ తయారు చేసిన వ్యాక్సిన్ ఆశాజనకంగా కనిపిస్తోంది’ అని ఏబీసీవీఏసీ అధ్యక్షుడు గెరాల్డో బార్బోసా అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఆర్డర్ చేసుకునే వ్యాక్సిన్లకు అదనంగా వీటిని కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అయితే, దీనికి బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థ అన్విసా తుది అనుమతి ఇవ్వాల్సి ఉంది.
బ్రెజిల్లో కరోనా వ్యాక్సిన్‌పై తీవ్ర అలసత్వం వహిస్తున్నారని జైర్ బోల్సోనారో ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువయ్యాయి. అమెరికా తర్వాత అత్యధిక కరోనా మరణాలు బ్రెజిల్‌లోనే చోటుచేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందనే ఆరోపణలను అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఎదుర్కొంటున్నారు. వ్యాక్సిన్ పంపిణీపై ఆలస్యం చేయడం ప్రజల్లో అసహనాన్ని పెంచుతోందని అక్కడి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే ట్విటర్లో అభిప్రాయపడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా అధ్యక్షుడి తీరును విమర్శిస్తోన్న కొన్ని రాష్ట్రాలు సొంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. వీటితో పాటు ఏబీసీవీఏసీ వంటి కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టే వ్యాక్సినేషన్‌తో కరోనా పోరులో ముందున్న ఆరోగ్య కార్యకర్తలు, వివిధ ప్రాధాన్యత వర్గాలకు వ్యాక్సిన్ అందినప్పటికీ.. ప్రైవేటు వైద్యం పొందేవారికోసం ఈ ప్రక్రియను చేపడుతామని పేర్కొంటున్నాయి. బ్రెజిల్ కరోనా వ్యాక్సిన్ పదికోట్ల డోసుల కోసం ఇప్పటికే ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా వద్ద ఆర్డర్ పెట్టింది. ప్రపంచంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో బ్రెజిల్ మూడో స్థానంలో, కొవిడ్ మరణాల్లో రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు బ్రెజిల్లో 77లక్షల మందిలో వైరస్ బయటపడగా లక్షా 96వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలా ఉంటే, తాము ఆవిష్కరించిన 'కొవాగ్జిన్' టీకాపై ఎన్నో దేశాలు ఆసక్తి చూపిస్తున్నట్లు భారత బయోటెక్ సంస్థ జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్ల ఇటీవల వెల్లడించారు. ఆయా దేశాల దౌత్యవేత్తలు తమ యూనిట్ సందర్శనకు రావటం భారత్ బయోటెక్‌కు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నామని, వీటితోపాటు టీకా సరఫరా చేయాల్సిందిగా వివిధ దేశాల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్లు తెలిపారు. ఇక మరో భారతీయ సంస్థ జైడస్ క్యాడిలా కూడా కరోనా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలకు అనుమతులు పొందిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి..
కొవాగ్జిన్ టీకా వినియోగానికి డీసీజీఐ అనుమతి!
చైనా టీకాల సామర్థ్యంపై ఇంకా అనిశ్చితే!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WT20 WC 2023: మహిళల టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా షెడ్యూల్ ఇదే
-
Crime News
Rajasthan: పెట్రోల్ ట్యాంకర్లో మద్యం అక్రమ రవాణా..!
-
World News
Australia: డాల్ఫిన్లతో ఈతకని దిగి.. సొర చేపకు చిక్కి..!
-
Sports News
Gill: ‘శుభ్‌మన్.. నాగ్‌పుర్ ఏదో చెబుతోంది చూడు’’: ఉమేశ్ యాదవ్ ఫన్నీ ట్వీట్
-
World News
Wikipedia: పాక్‌లో వికీపీడియాపై నిషేధం.. స్పందించిన వికీమీడియా
-
General News
Rushikonda: బోడికొండకు కవరింగ్.. జర్మన్ టెక్నాలజీతో జియో మ్యాటింగ్