Sputnik V: బ్రెజిల్‌లో అనుమతి నిరాకరణ

Brazil: స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ వినియోగానికి బ్రెజిల్‌ నిపుణుల బృందం అనుమతుల నిరాకరించింది..

Updated : 28 Apr 2021 12:38 IST

వ్యాక్సిన్‌పై రష్యా తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపణ

బ్రెసీలియా: కరోనాతో అల్లాడుతున్న బ్రెజిల్‌ రక్షణ పరమైన కారణాలు చూపుతూ తమ దేశంలో రష్యా తయారీ స్పుత్నిక్‌-వి (Sputnik V) టీకా వినియోగానికి అనుమతి నిరాకరించింది. బ్రెజిల్‌లో అనేక రాష్ట్రాలు మహమ్మారితో అల్లాడుతుండగా దాదాపు మూడు కోట్ల స్పుత్నిక్‌ వ్యాక్సిన్లు తెప్పించుకునేందుకు విజ్ఞప్తులు పెట్టుకున్నాయి. ఈ క్రమంలో స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతుల విషయమై సమావేశమైన ఐదుగురు నిపుణుల బృందం అందుకు నిరాకరించింది. Corona Vaccine తయారీలో నిబంధనలు ఉల్లంఘించడం సహా తప్పుడు సమాచారాన్ని అందించారని బ్రెజిల్‌ ఔషధ నియంత్రణ సంస్థ ఆరోపించింది. స్పుత్నిక్‌-వి తయారీ కోసం వినియోగించిన అడినో వైరస్‌ టీకా తీసుకున్నవారిలో జ్వరం వంటి దుష్ప్రభావాలు కనిపించడం సహా కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతున్నాయని బ్రెజిల్‌ ఔషధ నియంత్రణ సంస్థ ఆరోపించింది. 

బ్రెజిల్ ఆరోపణలపై రష్యా మండిపడింది. టీకాలో వినియోగించిన అడినో వైరస్‌ కారణంగా టీకా తీసుకున్నవారు దుష్ప్రభావాల బారిన పడిన దాఖలాలు ఏమీ లేవని స్పష్టం చేసింది. బ్రెజిల్‌తో సంప్రదింపులు కొనసాగుతాయన్న రష్యా..  ఆ దేశం కోరిన సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. గతంలోనూ బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సొనారో (Jair Bolsonaro) టీకాలకు వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని