Jair Bolsonaro: మరణమో..గెలుపో..తన భవిష్యత్తుపై బోల్సోనారో!

బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్తుకు సంబంధించి తనకు మూడు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయని తెలిపారు...

Published : 29 Aug 2021 12:10 IST

బ్రెజీలియా: బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్తుకు సంబంధించి తనకు మూడు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయని తెలిపారు. జైలుకు వెళ్లడం, మరణించడం, 2022 అధ్యక్ష ఎన్నికలు గెలవడం.. ఇందులో ఏదో ఒకటి జరగొచ్చన్నారు. అయితే, తనని అరెస్టు చేయడమనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఈ భూమిపై తనని బెదిరించే వారే లేరన్నారు. పరోక్షంగా తానేమీ తప్పు చేయలేదంటూ తన నిర్ణయాల్ని, విధానాలను సమర్థించుకున్నారు. మతపరమైన నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బోల్సోనారో గత కొన్నిరోజులుగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటి స్థానంలో బ్యాలెట్‌ పత్రాలను తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే అధ్యక్ష ఎన్నికల ఫలితాల్ని అంగీకరించే ప్రసక్తే లేదని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో బోల్సోనారో కంటే మాజీ అధ్యక్షుడు లూయిస్‌ ఇనాసియో లూలా డి సిల్వాకు పెద్దఎత్తున మద్దతు లభించింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా బోల్సోనారో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరోవైపు బ్రెజిల్‌లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అత్యున్నత నిర్ణాయక సంస్థ ఎలక్టోరల్‌ కోర్ట్‌ మాత్రం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ వ్యవస్థనే సమర్థిస్తోంది. అసలు బ్యాలెట్‌ పత్రాల గురించి చర్చించడమే శుద్ధ దండగ అని వాదిస్తోంది. 2018 నాటి ఎన్నికల్లో బోల్సోనారో గెలుపులో మతపరమైన వర్గం కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో మరోసారి వారి మద్దతును కూడగట్టేందుకు బోల్సోనారో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని