Cyber Attack: బ్రెజిల్‌ ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌ హ్యాక్‌.. వాయిదాపడ్డ నిబంధనల అమలు

బ్రెజిల్ ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయింది. ఈ విషయాన్ని ప్రభుత్వం ధ్రువీకరించింది. జాతీయ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం, డిజిటల్ టీకా ధ్రువీకరణ పత్రాల జారీ తదితర వ్యవస్థలు దెబ్బతిన్నట్లు పేర్కొంది. ఇప్పటికే వెబ్‌పేజీ డౌన్‌ కాగా, పౌరుల ఆరోగ్య సమాచారానికి...

Published : 11 Dec 2021 23:36 IST

బ్రెసిలియా: బ్రెజిల్ ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయింది. ఈ విషయాన్ని ప్రభుత్వం ధ్రువీకరించింది. జాతీయ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం, డిజిటల్ టీకా ధ్రువీకరణ పత్రాల జారీ తదితర వ్యవస్థలు దెబ్బతిన్నట్లు పేర్కొంది. ఇప్పటికే వెబ్‌పేజీ డౌన్‌ కాగా, పౌరుల ఆరోగ్య సమాచారానికి సంబంధించిన గేట్‌ వే ‘కనెక్ట్‌ ఎస్‌యూఎస్‌’ యాప్‌లోని వినియోగదారుల డేటా అదృశ్యమైనట్లు తెలిపింది. మరోవైపు.. ఈ దాడి కారణంగా శనివారం నుంచి బ్రెజిల్‌కు చేరుకునే ప్రయాణికుల కోసం కొత్తగా అమలు చేయాల్సిన నిబంధనలను వారం పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

‘డేటా కావాలంటే సంప్రదించండి’

వెబ్‌సైట్‌లోని డేటాను కాపీ చేసుకుని, అనంతరం అందులోంచి తొలగించినట్లు సంబంధిత హ్యాకర్లు ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఒకవేళ డేటా తిరిగి కావాలంటే తమను సంప్రదించాలంటూ ఈ-మెయిల్, టెలిగ్రామ్ వివరాలు పెట్టడం గమనార్హం. అయితే.. డేటా కోల్పోయే పరిస్థితి లేదని, హ్యాకర్లు తొలగించిన మొత్తం సమాచారం తమ శాఖ వద్ద అందుబాటులో ఉందని ఆరోగ్య మంత్రి మార్సెలో క్వీరోగా తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారని చెప్పారు. మరోవైపు ఈ వ్యవస్థలను పునరుద్ధరించేందుకు సైబర్‌ నిపుణులు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

వాస్తవానికి శనివారం నుంచి బ్రెజిల్‌కు చేరుకునే అన్‌వ్యాక్సినేటెడ్‌ ప్రయాణికులు ఐదు రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలి.. దీంతోపాటు టెస్టు చేయించుకోవాలనే నిబంధనలు రూపొందించారు. కానీ, సైబర్‌ దాడి నేపథ్యంలో.. ప్రస్తుతం టీకా డేటాను ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వీటి అమలును ఒక వారం పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని