Pune Porsche Crash Case: పుణె కారు ప్రమాదం కేసు: బయటపడుతున్న డాక్టర్ క్రిమినల్‌ నెట్‌వర్క్‌..!

పుణెలో తప్పతాగిన మైనర్‌ పోర్ష్‌ కారును డ్రైవింగ్‌ చేసి ఇద్దరు ప్రాణాలు తీసిన కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఆధారాలు తారుమారు చేసిన డాక్టర్‌ వెనుక పెద్ద నెట్‌వర్క్‌ పనిచేస్తున్నట్లు గుర్తించారు. 

Published : 13 Jun 2024 11:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  మహారాష్ట్రలోని పుణెలో ఓ మైనరు (17) నిర్లక్ష్య డ్రైవింగు కారణంగా ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతిచెందిన కేసు దర్యాప్తులో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు బయటపడుతున్నాయి. రక్త నమూనా మార్పిడికి పాల్పడిన డాక్టర్‌ సామాన్యుడు కాదు. అతడి వెనుక పెద్ద రాకెట్‌ నడుస్తోంది. ఇక తాజాగా నిందితుడి తండ్రి విశాల్‌ అగర్వాల్‌ ఏకంగా జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ప్రాంగణంలోనే రూ. లక్షలు లంచం చెల్లించినట్లు  గుర్తించారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలను కూడా సేకరించారు. నిందితుడి రక్త నమూనాలను మార్చేందుకు ఈ సొమ్మును ససూన్‌ ఆస్పత్రి ప్యూన్‌ అతుల్‌ ఘాల్‌కాంబ్లే అనే వ్యక్తి వచ్చి తీసుకెళ్లినట్లు ధ్రువీకరించారు. మధ్యవర్తికి విశాల్‌ అగర్వాల్‌ డ్రైవర్‌ ద్వారా రూ. 4 లక్షలు అందజేశాడు. వీటిల్లో రూ.3 లక్షలను అతుల్‌కు చెల్లించారు. ఇప్పటికే ఆస్పత్రి ప్యూన్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇక విశాల్‌ అగర్వాల్‌ దంపతులు, ఈ వ్యహారానికి మధ్యవర్తిగా వ్యవహరించిన అష్ఫాక్‌ మకాన్‌దార్‌ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. అమర్‌ గైక్వాయిడ్‌ అనే వ్యక్తి కూడా మధ్యవర్తిగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఈ కేసులో నిందితుడి రక్త నమూనాలను అతడి తల్లి బ్లడ్‌ శాంపిల్స్‌తో భర్తీ చేసిన విషయం తెలిసిందే. 

నాలుగు జిల్లాల్లో క్రిమినల్‌ రాకెట్‌..!

ససూన్‌ ఆస్పత్రిలోని ఫోరెన్సిక్‌ విభాగం పనితీరుపై నీలినీడలు కమ్ముకొంటున్నాయి. ఈ విభాగం అధిపతి అయిన డాక్టర్‌ అజేయ్‌ తావ్‌డే గతంలో కూడా పలు కేసుల్లో ఇలానే రక్త నమూనాలు మార్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పుణె క్రైం బ్రాంచ్‌ అధికారులు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే ఓ ఆంగ్ల వార్తా పత్రిక వద్ద వ్యక్తం చేశారు. తావ్‌డే నిందితుల రక్తనమూనాలు మార్చేయడం ఇదే తొలిసారి కాదని వారు పేర్కొన్నారు. ఇతడికి సంబంధించిన డాక్టర్లు, బ్రోకర్ల నెట్‌వర్క్‌ పుణె చుట్టుపక్కల పశ్చిమ మహారాష్ట్రలోని నాలుగు జిల్లాల్లో విస్తరించినట్లు వెల్లడించారు. ఏదైనా హైప్రొఫైల్‌ కుటుంబం మద్యపానం చేసి వాహనం నడిపినట్లు కేసు నమోదైతే.. ఈ నెట్‌వర్క్‌ ఆ కుటుంబాన్ని సంప్రదిస్తుంది. తర్వాత కొంత మొత్తం సొమ్ములు తీసుకొని రక్తనమూనాలు మార్చేసి.. స్వల్ప శిక్షలు పడేట్లు చేస్తుంది. కేసును బట్టి కనీసం రూ.5 లక్షలు వసూలు చేస్తారని చెబుతున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి ఈ నెట్‌వర్క్‌ చురుగ్గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.  

తావ్‌డేపై గతంలో కూడా ఆరోపణలు..

ఈ కేసులో కీలక నిందితుడైన ససూన్‌ ఆస్పత్రి ఫోరెన్సిక్‌ విభాగం అధిపతి డాక్టర్‌ తావ్‌డేపై గతంలో కూడా తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. డ్రగ్‌ కేసులు, కిడ్నీ మార్పిడి రాకెట్‌ వంటి నేరాల్లో అతడి పేరు వినిపించింది. అయినా కానీ, అతడిని ఫోరెన్సిక్‌ విభాగానికి అధిపతిగా పదోన్నతి కల్పించారు. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. 

గత నెలలో ససూన్‌ ఆస్పత్రి డీన్‌ వినాయక్‌ కాలే మాట్లాడుతూ మహారాష్ట్ర మంత్రి హసన్‌ ముష్రాఫ్‌, స్థానిక ఎమ్మెల్యే సునీల్‌ టింగ్రేల నుంచి ఓ లేఖ వచ్చిందని.. దానిలో తావ్‌డేను హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌ చేయాలని సూచించినట్లు వెల్లడించారు. ఈ ప్రకటన తర్వాత వినాయక్‌ కాలేను ప్రభుత్వం బలవంతపు సెలవుపై పంపించింది. ఈయన ప్రస్తావించిన ఇద్దరు నేతలు అజిత్‌ పవార్‌ వర్గానికి చెందినవారే. ప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోనే యర్వాడ పోలీస్‌ స్టేషన్‌ను ఎమ్మెల్యే సునీల్‌ సందర్శించడం విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యహారంలో బ్రోకర్‌ ఆష్ఫాక్‌ మకాన్‌దార్‌తో సునీల్‌కు  సన్నిహిత సంబంధాలున్నాయి. ‘విశాల్‌కు సాయం చెయ్యి’ అని ఎమ్మెల్యే చెప్పడంతోనే అతడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని