Bride: వధువుకు ‘మేకప్‌’ షాక్‌.. పెళ్లి వద్దన్న వరుడు..!

పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టాల్సిన నవ వధువుకు ‘మేకప్‌’.. పెద్ద కష్టం తెచ్చిపెట్టింది. వెరైటీ కోసం ప్రయత్నించి చివరకు ఆసుపత్రిపాలైంది. అటు పెళ్లి కూడా రద్దు కావడం విచారకరం.

Updated : 04 Mar 2023 10:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన పెళ్లిలో మరింత అందంగా కన్పించాలని మేకప్ కోసం బ్యూటీపార్లర్‌కు వెళ్లిందో నవ వధువు (Bride). అక్కడ చేసిన ఓ ప్రయోగం బెడిసికొట్టి ఉన్న ముఖం కాస్తా వికారంగా మారింది. దీంతో నాకు ఈ అమ్మాయి వద్దు మొర్రో అంటూ వరుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. కర్ణాటక (Karnataka)లో హసన్‌ జిల్లాలో కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

హసన్‌ (Hassan) జిల్లా అరసికరె గ్రామానికి చెందిన ఓ యువతికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. వివాహ తేదీ దగ్గర పడుతుండటంతో 10 రోజుల క్రితం ఆ అమ్మాయి స్థానిక బ్యూటీ పార్లర్‌ (Beauty Parlour)కు వెళ్లింది. అక్కడ పనిచేస్తున్న ఓ బ్యూటీషియన్‌.. కొత్త రకమైన మేకప్‌ వేస్తానని చెప్పింది. ముందు ముఖానికి ఫౌండేషన్‌ రాసి ఆ తర్వాత ఆవిరి పట్టింది. ఇది కాస్తా బెడిసికొట్టి ఆ అమ్మాయి ముఖం కాలిపోయి బొబ్బలెక్కింది. ముఖాకృతి కూడా మారిపోయింది. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.

ప్రస్తుతం ఆ యువతి (Bride) ఐసీయూలో చికిత్స పొందుతోంది. అలెర్జీ కారణంగా బాధిత యువతికి ఇలాంటి పరిస్థితి ఎదురై ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ బ్యూటీషియన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ పరిణామాలతో ఆ అమ్మాయి పెళ్లిని తొలుత వాయిదా వేశారు. అయితే, వధువు ముఖ పరిస్థితి గురించి తెలుసుకున్న ఆ వరుడు (Groom) తనకీ పెళ్లి (Marriage) వద్దంటూ రద్దు చేసుకున్నాడు.

అందం కోసం బ్యూటీపార్లర్లకు వెళ్లడం ఈ కాలంలో సహజమే అయినప్పటికీ.. ఇలాంటి ఘటనలతో అప్రమత్తంగా ఉండక తప్పదు. కాస్మోటిక్‌ ఉత్పత్తులతో ప్రయోగాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని.. ఆ ఉత్పత్తుల తయారీ మార్గదర్శకాలకు అనుగుణంగానే వాటిని ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని