Brij Bhushan: దానికంటే చనిపోవడమే మేలని భావిస్తా.. బ్రిజ్‌ భూషణ్‌ సెల్ఫీ వీడియో

మహిళా రెజ్లర్లు తనపై చేసిన ఆరోపణలపై డబ్ల్యూఎఫ్‌ఐ (WFI) అధ్యక్షుడు, భాజపా ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ (Brij Bhushan Sharan Singh) స్పందించారు. తనలో శక్తి ఉన్నంత వరకు పోరాడతానంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 

Published : 28 Apr 2023 10:01 IST

దిల్లీ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జాతీయ రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు, భాజపా ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్ (Brij Bhushan Sharan Singh) మౌనం వీడారు. మహిళా రెజ్లర్లు (Wrestlers Protest) తనపై చేసిన ఆరోపణలపై పరోక్షంగా స్పందించారు. ఈ మేరకు గురువారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో తనపై వచ్చిన లైంగిక ఆరోపణల అంశాన్ని ప్రస్తావించకుండా.. తన నిస్సహాయతను ఎప్పటికీ అంగీకరించలేనని స్పష్టం చేశాడు.

‘‘మిత్రులారా.. నేనెప్పుడూ జీవితంలో ఏం సాధించాను? ఏం కోల్పోయాను? అనే దాని విషయాలగురించి ఆలోచించను. నాలో పోరాడేందుకు శక్తి లేదని భావించిన రోజు నేను నిస్సహాయుడినని భావిస్తా. అలాంటి జీవితాన్ని నేను ఎప్పటికీ ఇష్టపడను. దానికంటే నేను చనిపోవడం మేలని భావిస్తా’’ అని బ్రిజ్‌ భూషణ్‌ వీడియోలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బ్రిజ్‌ భూషణ్‌ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినా దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని మహిళా రెజ్లర్లు మరోసారి జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 

మరోవైపు, బ్రిజ్‌ భూషణ్‌పై కేసు నమోదు చేయాలని రెజ్లర్లు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం దిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కేసు నమోదుకు ముందు కొంత ప్రాథమిక దర్యాప్తు జరగాల్సి ఉందని దిల్లీ పోలీసులు సుప్రీం కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీని కలిసి తమ సమస్యలు చెప్పేందుకు సమయం ఇవ్వాలని మహిళా రెజ్లర్లు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. మరోవైపు దేశంలోని మాజీ, తాజా క్రీడాకారులందరూ ఒక్కతాటిపైకి వచ్చి మాకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో వారికి మద్దతుగా ఒలింపిక్‌ ఛాంపియన్‌ షూటర్‌ అభినవ్‌ బింద్రా సామాజిక మాధ్యమాల వేదికగా రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని