
Britain To End Afghanistan Evacuations: అఫ్గాన్ నుంచి బ్రిటన్ వాసుల తరలింపునకు ప్రణాళిక..!
ఇంటర్నెట్‌డెస్క్: బ్రిటన్ వాసులను అఫ్గానిస్థాన్ నుంచి మరికొన్ని గంటల్లోనే తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై బ్రిటన్ డిఫెన్స్ సెక్రటరీ బెన్ వాలెస్ మాట్లాడుతూ ‘‘ మాతోపాటు బ్రిటన్ తరలించేవారిని ఇప్పటికే సిద్ధం చేశాం. దాదాపు 1000మంది కాబుల్ ఎయిర్‌పోర్టు లోపల ఉన్నారు. మావాళ్లను గుర్తించే ప్రక్రియకు ఇప్పటికే ఒక విధానం అనుసరిస్తున్నాం. తరలింపు ప్రక్రియ చివరికొచ్చింది.. మరికొన్ని గంటలు మాత్రమే పడుతుంది’’ అని పేర్కొన్నారు.
ఇప్పటికే బ్రిటన్ వచ్చేవారు బసచేసిన బారెన్ హోటల్‌ను మూసివేశారు. దీంతోపాటు బ్రిటన్ శరణు కోరేందుకు విమానాశ్రయం వద్ద అబ్బే గేటు వద్ద ఏర్పాటు చేసిన శిబిరాన్ని కూడా మూసివేశారు. ఇప్పటి వరకు 14వేల మందిని అక్కడి నుంచి తరలించారు.
స్పెయిన్ తరలింపు పూర్తి..
స్పెయిన్ శుక్రవారం తమ వారిని తరలించే కార్యక్రమాన్ని పూర్తి చేసింది. చివరి రెండు స్పెయిన్ విమానాలు దుబాయ్ చేరుకొన్నాయి. వారం క్రితమే స్పెయిన్ తరలింపు కార్యక్రమాన్ని చేపట్టింది. నేటి ఉదయం 7.30కు తొలి ఏ400 విమానం దుబాయ్‌లో దిగింది. రెండో విమానం 8.20 సమయంలో దుబాయ్ చేరుకొంది.
ఫ్రాన్స్ తరలింపు కార్యక్రమం పొడిగింపు..
అఫ్గాన్ నుంచి ఫ్రాన్స్, వారి సహాయకుల తరలింపు ప్రక్రియను పొడిగించే అవకాశం ఉంది. నేటి సాయంత్రానికి తరలింపు ప్రక్రియ పూర్తవుతుందని గతంలో ఫ్రాన్స్ పేర్కొంది. కానీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ మాత్రం మరింత మంది అఫ్గాన్లను తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇప్పటికే వారంతా కాబుల్ విమానాశ్రయం బయట వేచి ఉన్నారని తెలిపారు.