BS Yediyurappa: యడియూరప్పను అరెస్టు చేయవచ్చు: కర్ణాటక మంత్రి

కర్ణాటకలో భాజపా అగ్రనేత బీఎస్‌ యడియూరప్ప అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. పోక్సో కేసులో ఆయన్ను అవసరమైతే సీఐడీ అదుపులోకి తీసుకోవచ్చని రాష్ట్ర హోం మంత్రి పేర్కొన్నారు. 

Published : 13 Jun 2024 14:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కర్ణాటక భాజపా అగ్రనేత బీఎస్‌ యడియూరప్ప (BS Yediyurappa)ను పోక్సో కేసులో అవసరమైతే అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి జి.పరమేశ్వర గురువారం వెల్లడించారు. సీఐడీ దీనిపై నిర్ణయం తీసుకొంటుందని పేర్కొన్నారు. బుధవారం అధికారులు ఆయనకు సమన్లు పంపించారు. దీనికి ఆయన నుంచి సమాధానం వచ్చింది. ప్రస్తుతం దిల్లీలో ఉండటంతో జూన్‌ 17వ తేదీన సీఐడీ ముందు హాజరవుతానని పేర్కొన్నారు. 

సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కావడానికి కొద్దిరోజుల ముందు యడియూరప్పపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 17 ఏళ్ల బాలికపై ఆయన లైంగిక దాడికి పాల్పడినట్లు వాటి సారాంశం. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి యడియూరప్పను అభ్యర్థించారు. అయితే తన కుమార్తెను ఆయన బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోక్సో కేసు నమోదైంది. ఆ కేసును సీఐడీ దర్యాప్తు చేస్తోంది. అయితే ఆరోపణలు చేసిన మహిళ.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. ఇదిలాఉంటే.. బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను సీఐడీ ఇదివరకే రికార్డు చేసింది.

యడియూరప్ప కర్ణాటకకు  2008-2021 మధ్య నాలుగు సార్లు సీఎం పదవిలో సేవలు అందించారు. ఆయన 2021లో సీఎం పదవికి చివరిసారిగా రాజీనామా చేశారు. ఆయన తర్వాత ఆ పదవిలోకి బసవరాజ్‌ బొమ్మై వచ్చారు. మరోవైపు యడియూరప్పకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఆయన్ను కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమించారు.  గతేడాది నవంబరులో రాష్ట్ర పార్టీ బాధ్యతలను హైకమాండ్‌ ఆయన కుమారుడు విజయేంద్రకు అప్పగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని